Praja Durbar : మంత్రులు, నేతలకు స్పెషల్ డ్యూటీలు.. చంద్రబాబు ప్లాన్ అదుర్స్

ఏపీలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏకపక్ష విజయాన్ని అందించారు. అందుకే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుపరిపాలన అందించాలని చంద్రబాబు భావిస్తున్నారు. నిధుల కొరత తో పాటు ఇతరత్రా ఇబ్బందులు ఉన్నా అధిగమించాలని చూస్తున్నారు. ముఖ్యంగా ప్రజలతో పార్టీ ఎమ్మెల్యేలు మమేకం కావాలని సూచిస్తున్నారు.

Written By: Dharma, Updated On : August 1, 2024 1:19 pm
Follow us on

Praja Durbar : ఎందుకో ఈసారి టిడిపి కూటమి ప్రభుత్వంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వీలైనంతవరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాక్షేత్రంలో ఉండాలని చంద్రబాబుతో పాటు పవన్ ఆదేశిస్తున్నారు. ప్రజా దర్బార్లు నిర్వహించాలని సూచిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలకు డ్యూటీలు వేస్తున్నారు. పార్టీ కార్యాలయాల్లో ప్రజాదర్బార్లు నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని సూచిస్తున్నారు. అటు టిడిపి, ఇటు జనసేన ఒకేసారి ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. ఇప్పటికే పాలనపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ సైతం కష్టపడుతున్నారు. మంత్రుల సైతం వారి పనుల్లో నిమగ్నమయ్యారు. వైసిపి దారుణ పరాజయానికి కారణం.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్లకపోవడం. ప్రజా సమస్యలు తెలుసుకోకపోవడమే. మూడేళ్ల తర్వాత గడపగడపకు మన ప్రభుత్వం అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజలను పలకరించారు. కానీ అప్పటికే ఆగ్రహంగా ఉన్న ప్రజలు వారిని తిరస్కరించారు. ప్రశ్నించారు నిలదీశారు. ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఆ కార్యక్రమం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రజలతో ప్రభుత్వానికి ఎలాంటి గ్యాప్ ఉండకూడదని పార్టీ ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. ప్రజలతో నేతలను భాగస్వామ్యం అయ్యేలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఎటువంటి హంగామా లేకుండా కార్యక్రమం కొనసాగుతోంది. వినతులు స్వీకరిస్తున్న లోకేష్ అక్కడికక్కడే పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు. దీంతో ప్రజలు సంతృప్తి చెందుతున్నారు. అందుకే ప్రజాదర్బార్ ను రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వంతుల వారీగా ప్రజా దర్బార్ నిర్వహించాలని నేతలను ఆదేశించారు.

* రెండు వారాలపాటు ప్రజాదర్బార్
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు వారాలపాటు ప్రజాదర్బార్ కొనసాగనుంది. రోజుకో మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మంత్రులతో పాటు కీలక నాయకులకు అక్కడ డ్యూటీలు వేశారు. వారు విధిగా ఉదయం 7 గంటలకు కార్యాలయానికి చేరుకోవాలని.. ప్రజలకు అందుబాటులో ఉండాలని.. వినతులు స్వీకరించి పరిష్కారం మార్గం చూపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతినెల దీనిని కొనసాగించాలని భావిస్తున్నారు. ఆగస్టు నెలకు సంబంధించి రెండు వారాలపాటు ప్రజా దర్బార్ కొనసాగనుంది. వీటికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు చంద్రబాబు.ఒక క్రమ పద్ధతిలో, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ, ప్రజల్లోకి మంచి సంకేతాలు ఇచ్చేలా ప్లాన్ చేశారు.

* వీరికే బాధ్యతలు
ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ప్రజా దర్బారు నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రేపు అనగా రెండో తేదీ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, మంత్రి గొట్టిపాటి రవి, మూడో తేదీ సీఎం చంద్రబాబు తో పాటు టిడిపి రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్, ఐదో తేదీ మంత్రి కింజరాపు అచ్చెనాయుడు, బొల్లినేని రామారావు, ఆరో తేదీ మంత్రి వంగలపూడి అనిత, బీద రవిచంద్ర యాదవ్, 8వ తేదీ మంత్రి పొంగూరు నారాయణ, మాజీ మంత్రి జవహర్, 9వ తేదీ మంత్రి నిమ్మల రామానాయుడు, టిడిపి రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్, పదో తేదీ సీఎం చంద్రబాబు, పల్లా శ్రీనివాస్ యాదవ్, 12వ తేదీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వర్ల రామయ్య, 13వ తేదీ మంత్రి టీజీ భరత్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, 14వ తేదీ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, కిషోర్ కుమార్ రెడ్డిలు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.

* రెండుసార్లు చంద్రబాబు హాజరు
ప్రజా దర్బార్ కు తానే రెండుసార్లు స్వయంగా హాజరు కానున్నట్లు చంద్రబాబు స్పష్టం చేయడం విశేషం. అయితే ఈ ప్రజా దర్బార్ విషయంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ తో చంద్రబాబు చర్చించారు. ఎవరికివారుగా పార్టీ కార్యాలయాల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 24 మంది మంత్రులకు గాను.. జనసేనలో ముగ్గురు, బిజెపికి ఒక మంత్రి ఉన్నారు. టిడిపి నుంచి 20 మంది మంత్రులు కొనసాగుతున్నారు. అయితే చంద్రబాబు ఈ రెండు వారాల్లో రెండుసార్లు ప్రజా దర్బార్ కు హాజరుకానుండడం విశేషం.