Chandrababu: రాజకీయ పార్టీలు( political parties) అన్నాక గెలుపు ఓటములు సహజం. ఎంతటి కాకలు తీరిన యోధులు అయినా.. ఒక్కోసారి చతికిల పడతారు. పరిస్థితుల ప్రభావంతో ఓటమి పలకరిస్తుంది కూడా. అయితే తమకు ఎదురైన పరిణామాలను, వైఫల్యాలను అధిగమించి ప్రజాభిమానాన్ని చూరగొనడమే రాజకీయ పార్టీల కర్తవ్యం. కానీ దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో ఓటమి ఎదురైన పార్టీలు గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ అదే స్వభావంతో ముందుకు వెళుతున్నాయి. మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న వారు, విమర్శలతో తప్పులు సరిదిద్దుకున్నవారు.. సమస్యలు, సవాళ్లలో అవకాశాలు వెతుక్కునేవారు రాజకీయాల్లో అతిపెద్ద మంది మాత్రమే ఉంటారు. రాజకీయాల్లో దురాలోచనలు, అహం భావాలు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రాణించవు. దానికి మూల్యం తప్పదు.
* అదే స్థాయిలో పాతాళానికి..
తెలుగు రాష్ట్రాల్లో కెసిఆర్( KCR), ఆయన కుమారుడు కేటీఆర్, ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నవారే. ఎవరు ఊహించిన స్థాయికి ఎదిగిన వారే. అయితే అంత ఎత్తుకు ఎదిగి కూలిపోయారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు ఎదురైన పరిస్థితిని చూసి ఆశ్చర్యపోతున్నారు. కానీ కొద్ది కాలానికి ముందుకు వెళితే చంద్రబాబుకు ఇటువంటి పరిస్థితి ఎదురైంది. కానీ ఆయన ఆత్మ పరిశీలన చేసుకున్నారు. లోపాలను సరిదిద్దుకున్నారు. ప్రజల్లోకి వెళ్లి అలుపెరగని పోరాటాలు చేశారు. ప్రత్యర్థుల చేతుల్లో అవహేళనకు గురయ్యారు. అయితే వాటిని సద్విమర్శలుగా భావించారు. అందులోనే లోపాలను గుర్తించి సరిదిద్దుకున్నారు.
* పవన్ కళ్యాణ్ కు హ్యాట్సాఫ్..
అయితే ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు( deputy CM Pawan Kalyan ) హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. జగన్మోహన్ రెడ్డితో సహా వైసిపి నేతలు ఆయనని ఎంతగానో అవమానించారు. వాటికి ఆయన కృంగిపోలేదు. అంతకంటే మించి పక్కదారి పట్టలేదు. దారి తప్పకుండా అన్నింటినీ ధైర్యం గా ఎదుర్కొని నిలబడ్డారు. తాను గెలవడంతో పాటు తన వాళ్లని గెలిపించుకున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. కానీ రాజకీయాలతో సహా ఏ రంగంలోనైనా గెలుపే ప్రామాణికం. అందుకే తెలంగాణలో కాంగ్రెస్.. ఏపీలో కూటమి పార్టీల గెలుపును కేస్ స్టడీగా తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డికి ఉంది. కానీ వారికి ఇప్పుడు అహం అడ్డు వస్తోంది. అందుకే గుణపాఠాలు నేర్చుకోలేకపోతున్నారు. మరింతగా దిగజారి పోతున్నారు.
* అహంభావం ఉంటే అంతే..
రాజకీయాల్లో అహంభావం ఉన్నవారు రాణించడం చాలా కష్టం. ఇందిరాగాంధీ( Indira Gandhi) మొదలుకొని కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి వరకు చాలామంది దీనికి మూల్యం చెల్లించుకున్న వారే. అలాగే రాజకీయాల్లో అతి విశ్వాసం, అతిశయం కూడా కొంపముంచుతాయి. దీనికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా చక్కటి ఆదర్శం. ఎందుకంటే ఆయన వాటికి లోబడి పని చేసిన ప్రతిసారి ఓడిపోయారు. వాటిని గుర్తించి అధిగమించిన ప్రతిసారి విజయం సాధించారు. అయితే కెసిఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అవ లక్షణాల గురించి ఒప్పుకోరు. ఎందుకంటే వారు తమను తాము అద్భుతం, మహా అద్భుతం అని చెప్పుకుంటారు. కానీ ఎంతటి యోధుడైన వారికి ఒక కర్మ రాసి ఉంటుంది. దాని ఫలితమే ఇప్పుడు కెసిఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయికి దిగజార్చింది. ఇకనైనా మారకుంటే ఇబ్బందులు తప్పవు అన్న హెచ్చరికలు వస్తున్నాయి. మారితే చంద్రబాబు మాదిరిగా అపజయాలనుంచి విజయాలను అందుకుంటారు. లేకుంటే మాత్రం అపజయాలు నిత్యం పలకరిస్తూనే ఉంటాయి.