Bihar And Jubilee Hills Results: రెండు ఎన్నికల ఫలితాలు.. ఒక రాష్ట్రంలో ఎన్టీఏ అధికారంలోకి వచ్చింది. దాయాది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టు నిలుపుకుంది. ఈ ఫలితాలు ఏపీలో ఎవరికి అనుకూలం? ఎవరికి ప్రతికూలం? ఇప్పుడు అంతటా ఇదే చర్చ. ఇండియా కూటమిపరంగా స్వల్ప ఉపశమనం. ఎన్డీఏ పరంగా భారీ విజయం. తెలంగాణ ఫలితం కాంగ్రెస్ తో పాటు వామపక్షాలకు స్వల్ప ఉపశమనం. కానీ బీహార్ లో ఎన్డీఏ భారీ విక్టరీతో తెలుగుదేశంతో పాటు జనసేనకు మాత్రం గొప్ప విజయం. భవిష్యత్ పై గొప్ప భరోసా కూడా. ఎటొచ్చి జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ రెండు ఫలితాలు చేదు గుళికలే. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఎంతమాత్రం రుచించదు.పైగా స్నేహితుడు కేసీఆర్ పార్టీ ఓడిపోయింది. పైగా చంద్రబాబు సన్నిహితుడైన రేవంత్ నాయకత్వం బలపడుతోంది. పోనీ ఏదో బీజేపీతో ఉన్న పూర్వ స్నేహంతో బీహార్ లో ఆ పార్టీ గెలిచిందని సంబరపడతామంటే కుదరదు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు సమకాలీకుడు, చంద్రబాబుతో పాటు కీలక భాగస్వామి నితీష్ సైతం బీజేపీతో సమాన గెలుపును సొంతం చేసుకున్నారు. ఇలా ఎటుచూసుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఎంతమాత్రం రుచించని ఫలితాలే.
చంద్రబాబుకు మంచి శుకునాలు..
చంద్రబాబుకు ( CM Chandrababu)అన్నీ మంచి శుకునాలే. ఎందుకంటే ఒక వైపు రాష్ట్రంలో పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. రాజ్యాంగబద్ధ పదివిలో ఉన్న ఉప రాష్ట్రపతి రాధాక్రిష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేసి చంద్రబాబు సర్కారుకు అండగా నిలిచారు. ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా హాజరైనట్టు అని చూపించారు. కేంద్రం చంద్రబాబు సర్కారుకు పూర్తిగా సహకారం అందించినట్టేనని సంకేతాలు పంపారు. మరోవైపు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి గోయల్ సైతం వచ్చారు. కీలక ఉపన్యాసం చేశారు. అదే సమయంలో తెలంగాణాలో మిశ్రమ ఫలితం వచ్చింది. తన స్నేహితులుగా ఉన్న బీజేపీ పెద్దలు తన సాయం కోరలేదు. ఆపై తన సన్నిహితుడు రేవంత్ తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు. అందునా తాను అనుకోకపోయినా.. తనను చిరకాల ప్రత్యర్థిగా భావిస్తున్న కేసీఆర్ మట్టికరిచారు. దీంతో ఉభయ కుశలోపరి అన్నట్టు చంద్రబాబు పట్టు బిగించినట్టే. రెండు విజయాలు. రెండు వైరి విజయాలు. అయినా చంద్రబాబుకే మేలనట్టు సాగాయి శుక్రవారం నాటి ఫలితాలు.
జగన్ ది సంకట స్థితి..
జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )ఏ కూటమిలో లేరు. ఆపై ఎవరు స్నేహితులో చెప్పుకునే స్థితిలో లేరు. తాను ప్రేమ చూపలేరు. ఆపై తనపై ప్రేమ ఉన్న వారు వ్యక్తం చేయలేరు. కాంగ్రెస్ అంటే విపరీతమైన ధ్వేషం. బీజేపీ అంటే సాఫ్ట్ కార్నర్. కానీ బీజేపీ విషయంలో ప్రకటన చేయలేరు. కాంగ్రెస్ తన బద్ధ వైఖరి అని ప్రకటించనూ లేరు. కానీ చంద్రబాబు అలా కాదు. బీజేపీతో కలిసి విజయాన్ని పంచుకుంటున్నారు. అదే బీజేపీ తెలంగాణలో తన మద్దతు కోరకపోవడంతో సేఫ్ జోన్ లో ఉన్నారు. పైగా కాంగ్రెస్ గెలుపు రూపంలో తన సన్నిహితుడు రేవంత్ నాయకత్వం మరింత బలపడిందని లోలోపల ఎంతో ఆనందంతో ఉన్నారు. ఇలా ఎలా చూసుకున్న చంద్రబాబుకు అన్నీ మంచి శకునాలే అన్నట్టు ఉంది పరిస్థితి. కానీ జగన్ ఆలోచనలు కలిసి రావడం లేదు. లోలోపల ఆనందానికి కూడా అవకాశం లేదు.