Chandrababu: వ్యవస్థలపై చంద్రబాబుకు ఎంతో పట్టు ఉంది. ఇది చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. కానీ అటువంటి చంద్రబాబుని ఒక పద్ధతి ప్రకారం జగన్ కేసులతో ఇబ్బంది పెట్టగలిగారు. దాదాపు 53 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే జగన్ కు దక్కిన అంతులేని విజయం కంటే.. చంద్రబాబును జైల్లో పెట్టడంతోనే దేశవ్యాప్తంగా జగన్ పేరు మార్మోగింది. అయితే చంద్రబాబు పరిస్థితిని చూసి న్యాయ నిపుణులే ఆశ్చర్యపోయారు. చంద్రబాబుతో పాటు వ్యవస్థల్లో అత్యంత శక్తివంతుడు రామోజీరావు. వీరిద్దరిని చూస్తే వ్యవస్థలు భయపడడం కాదు.. ఒక పాజిటివ్ దృక్పథంతో చూస్తాయి అన్న పేరు ఉంది.
2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అంతకు ముందున్న చంద్రబాబు సర్కార్లో వైఫల్యాలను ఎండగట్టారు. అప్పట్లో జరిగిన తప్పిదాలపై కేసులు నమోదు చేశారు. క్యాబినెట్ సబ్ కమిటీలను సైతం ఏర్పాటు చేశారు. కానీ కోర్టుకు వెళ్లి నాడు చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు. తనపై ఉన్న కేసులను రద్దు చేయించుకున్నారు. అయితే నాటి పరిస్థితిపై వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఒక అడుగు వెనక్కి వేశారు. చంద్రబాబుపై రాజకీయ వేధింపులను తగ్గించేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో పరిస్థితి మారింది. కాంగ్రెస్ పార్టీ సీఎం పదవి విషయంలో జగన్ కు సహకరించలేదు. కానీ చంద్రబాబు మాత్రం జగన్ రాజకీయంగా ఎదగకూడదని భావించి.. జగన్ చుట్టూ కేసుల ఉచ్చు అల్లుకునేందుకు మాత్రం చంద్రబాబు సహకరించారు. అందుకే జగన్ కు కాంగ్రెస్ కంటే చంద్రబాబు పైనే కోపం ఎక్కువ. అందుకే గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబును ఇరికించాలని చూశారు. అసలు ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబును అరెస్టు చేయించారు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచగలిగారు.
వాస్తవానికి చంద్రబాబును జగన్ టచ్ చేయలేరని అంతా భావించారు. ఒకవేళ టచ్ చేసిన గంటల వ్యవధిలో చంద్రబాబు బయటకు వస్తారని అనుకున్నారు. కానీ గంటల రోజులయ్యాయి. రోజులు వారాలుగా మారాయి. నెలలు గడిచాయి. అయితే ఎలాగోలా చంద్రబాబుకు బెయిల్ లభించింది. దీంతో న్యాయవ్యవస్థ పై చంద్రబాబుకు పట్టు తప్పిందన్న కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన ఆలోచింపజేసింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు ఉన్న సంగతి తెలిసిందే. దీనిని రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఏపీ సీఐడి పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. అందులో భాగంగా నిన్న అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది కేసుకు సంబంధించి వివరాలను ఆన్లైన్లో చూశారు. అన్ని కేసులకు సంబంధించి వివరాలు ఉన్న.. చంద్రబాబు స్కిల్ స్కాం కేసు వివరాలు కనిపించలేదు. అయితే ఇందులో తమ ప్రమేయం లేదని సిఐడి తరపు న్యాయవాది చెప్పగా.. అంతా దైవ ఆదేశం అంటూ చంద్రబాబు తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న న్యాయమూర్తి చిరునవ్వులు చిందించారు. అయితే ఈ విషయంలో ఎటువంటి అనుమానాలకు తావు లేకున్నా.. న్యాయవ్యవస్థపై చంద్రబాబుకు పట్టు ఉందన్న విషయాన్ని మాత్రం గుర్తించాలి.