Chandrababu and Revanth Reddy: కొన్ని విషయాలు సందర్భానుసారంగా బయటపడతాయి. అవి కాస్త కొత్త చర్చకు దారి తీస్తాయి.. ఆ తర్వాత దాని వెనుక ఏం జరిగింది? ఎవరు ఉన్నారు? వారి వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే విషయాలు ప్రస్తావనకు వస్తుంటాయి. ఇప్పుడు అటువంటి విషయం ఒకటి తెరపైకి వచ్చింది. అది కాస్త విస్తృతమైన చర్చకు దారితీస్తోంది.
ఆదివారం రామోజీ ఫిలిం సిటీ లో రామోజీరావు కుటుంబ సభ్యులు బృహత్తరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. రామోజీ పేరుతో ఎక్స్ లెన్స్ అవార్డులను అందించారు. వివిధ రంగాలలో ప్రతిభను చూపిన వారందరికీ ఈ పురస్కారాలు అందజేశారు.. ఈ కార్యక్రమాన్ని అత్యంత గొప్పగా నిర్వహించారు రామోజీరావు కుటుంబ సభ్యులు. అంతేకాదు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ శర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ , తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు దగ్గర నుంచి మొదలుపెడితే చంద్రబాబునాయుడు వరకు రామోజీరావుతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇందులో రాజకీయపరమైన అంశాలను అతిరథ మహారధులు ప్రస్తావించలేదు. రామోజీ చేసిన సేవలను.. ఆయన సమాజానికి చేసిన కృషిని కొనియాడారు. ఆ తర్వాత మాట్లాడే వంతు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వచ్చింది. స్వతహాగానే మంచి మాటకారి అయిన రేవంత్ రెడ్డి.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. తన రాజకీయ జీవితం.. రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అంతేకాదు సరికొత్త విషయాన్ని లేవనెత్తారు. కాకపోతే ఆ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించలేదు. రామోజీరావుతో చంద్రబాబుకు విడదీయరాన్ని అనుబంధం ఉంది. అదే విషయాన్ని చంద్రబాబు కూడా చెప్పారు. కానీ నాడు రామోజీరావు పడిన ఇబ్బందిని ఆయన చెప్పలేకపోయారు.
అతిరథ మహారధుల ముందు రేవంత్ రెడ్డి నాడు రామోజీరావు పడిన ఇబ్బందిని రెండు ముక్కల్లో చెప్పేశారు. 2000 ఎకరాల్లో రామోజీరావు ప్రపంచ స్థాయి ఫిలిం సిటీని ఏర్పాటు చేశారని.. ఫిలిం సిటీ ఏర్పాటు విషయంలో చాలామంది అడ్డు తగిలారని.. అయినప్పటికీ రామోజీరావు వెనకడుగు వేయలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాస్తవానికి నాడు రామోజీరావుకు ఫిలిం సిటీ ఏర్పాటు విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇబ్బందులు కలగజేశారు. అందులో అసైన్డ్ భూములు ఉన్నాయని.. పేదల భూములు ఆక్రమించారని అధికారులను రామోజీ ఫిలిం సిటీ మీదికి పంపించారు.. ఇన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ రామోజీరావు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు మర్చిపోయారు..
అంతేకాదు రేవంత్ రెడ్డి ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ కిరణ్ కు వరం కూడా ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఈనాడు సంస్థల మీద గాని.. రామోజీ ఫిలిం సిటీ మీద గాని ఎటువంటి నష్టం కలగదని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని అతిరథ మహారాజుల ముందు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దుంతానని హెచ్చరించారు. అయితే ఈ విషయాన్ని రేవంత్ మర్చిపోయారా.. లేకుంటే కెసిఆర్ ని కూడా వైయస్ పై చేసిన విమర్శలోనే కలిపేశారా?!