Vangaveeti Radha : వంగవీటి రాధాను అలా ఫిక్స్ చేసిన చంద్రబాబు

Vangaveeti Radha : విపక్షాలకు చెక్ చెప్పాలంటే రాధా లాంటివారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే రాధా రాజకీయ జీవితం ఒక గాడిలో పడినట్టే. వంగవీటి అభిమానులకు ఇది శుభవార్తే.

Written By: NARESH, Updated On : June 18, 2024 11:09 am

Vangaveeti Radha

Follow us on

Vangaveeti Radha : వంగవీటి రాధాకు మంచి రోజులు వచ్చాయా? ఆయనపై చంద్రబాబు దృష్టి పెట్టారా? పొలిటికల్ లైఫ్ సెట్ చేయనున్నారా? కీలక పదవి ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో కూటమి విజయం వెనుక కాపు, కమ్మ సామాజిక వర్గం మధ్య సమన్వయమే కారణం. ఆ రెండు సామాజిక వర్గాల మధ్య కెమిస్ట్రీ కుదిరింది. దశాబ్దాల వైరాన్ని మరిచి ఆ రెండు సామాజిక వర్గాలు కలిసి పని చేశాయి. అయితే ఈ క్రమంలో వంగవీటి రాధ ఎక్కువగా కృషి చేశారు. కోస్తాలో కూటమి తరుపున ప్రచారం చేశారు. కాపు సామాజిక వర్గం ఓట్లను కూటమి వైపు టర్న్ చేశారు. చివరకు బిజెపి నుంచి పోటీ చేసిన సుజనా చౌదరి లాంటి నేతలకు కూడా మద్దతుగా ప్రచారం చేశారు. ఒక దశలో రాధ వైసీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అందుకు రాధ అంగీకరించలేదు.టిడిపిలో మనస్ఫూర్తిగా పనిచేశారు. ఇప్పుడు అదే రాధకు వరంగా మారనుంది.

2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధ. తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. చట్టసభలకు ఎన్నిక కావడం అదే తొలిసారి. అదే చివరిసారి కూడా. 2009లో రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పోటీ చేయడానికి టికెట్ దక్కలేదు. టిడిపిలోకి వచ్చినా చాన్స్ రాలేదు. ఈ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. కానీ టిడిపి కూటమి గెలుపుకు మాత్రం విశేషంగా కృషి చేశారు.

సీఎం చంద్రబాబు తో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంచడం వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో శాసనమండలిలో నాలుగు ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ముందుగా వంగవీటి రాధాను ఎమ్మెల్సీ చేసి.. క్యాబినెట్ లోకి తీసుకునేందుకు చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం.ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి చెందిన నలుగురికి పదవులు ఇచ్చారు. విపక్షాలకు చెక్ చెప్పాలంటే రాధా లాంటివారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే రాధా రాజకీయ జీవితం ఒక గాడిలో పడినట్టే. వంగవీటి అభిమానులకు ఇది శుభవార్తే.