Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu : ఇలా అయితే కష్టం.. మంత్రుల తీరుపై తేల్చేసిన చంద్రబాబు

CM Chandrababu : ఇలా అయితే కష్టం.. మంత్రుల తీరుపై తేల్చేసిన చంద్రబాబు

CM Chandrababu :  కొందరు మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారా? వారి పనితీరు మెరుగు పడటం లేదని భావిస్తున్నారా? పనితీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది ఏపీలో. ఈ నేపథ్యంలో జనసేన నుంచి ముగ్గురు, బిజెపి నుంచి ఒకరు, టిడిపి నుంచి 20 మంది మంత్రులు ఉన్నారు. అయితే క్యాబినెట్ లో దాదాపు పదిమంది మంత్రులు తొలిసారిగా ఎమ్మెల్యే అయినవారే. అప్పట్లోనే చంద్రబాబు గారికి దిశా నిర్దేశం చేశారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే.. కొత్తగా ఎన్నికైన పదిమందికి అవకాశం ఇచ్చానని చెప్పుకొచ్చారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని.. శాఖా పరమైన విషయాలు తెలుసుకోవాలని ఆదేశించారు. అయితే కొంతమంది పనితీరు బాగా లేకపోవడంతో చంద్రబాబు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తాజాగా మంత్రివర్గ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో కొందరు మంత్రులకు చంద్రబాబు క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది. పనితీరు మరింత వేగవంతం కావాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగే సంఘటనలపై బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న మంత్రులు స్పందించాల్సిందేనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేసిన పనులను కూడా చెప్పుకోలేకపోతున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పనితీరులో తనతో పోటీపడి పని చేయాలని చంద్రబాబు మంత్రులకు సూచించారని కూడా తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఘటనలను ఉదాహరిస్తూ మంత్రుల స్పందనను ప్రశ్నించారు చంద్రబాబు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఇన్చార్జ్, స్థానిక మంత్రులు తక్షణమే స్పందించాలని సూచించారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా మంత్రులు ప్రచారం చేసుకోలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉచిత ఇసుక విధానం విషయంలో మంత్రులు ఆశించిన స్థాయిలో పనిచేయని వైనాన్ని ప్రస్తావించారు చంద్రబాబు.

* ఉచిత ఇసుక విధానంపై
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విధానంపై ప్రజలకు తెలియజెప్పడంలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకు సైతం ఇదే నివేదికలు వెళ్లినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో డయేరియా బారిన పడి చాలామంది మృత్యువాత పడినట్లు ప్రచారం సాగుతోంది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న మంత్రులు స్పందించిన తీరు బాగాలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

* ఆ మంత్రుల తీరుపై
అలాగే మద్యం విధానంలో సైతం ఒకరిద్దరి మంత్రులు పేర్లు బయటకు రావడం పై కూడా చంద్రబాబు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ప్రజలకు జవాబుదారీగా ఉంటారని యువ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేశానని.. యాక్టివ్ గా పని చేస్తారని భావించానని.. కానీ తాను ఆశించిన స్థాయిలో మంత్రులు పని చేయడం లేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభం విషయంలో సైతం.. మంత్రులు వ్యవహరించిన తీరుపై ప్రస్తావనకు తీసుకొచ్చినట్లు సమాచారం. స్థానికంగా ఉన్న మంత్రులు సైతం కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదని చంద్రబాబు ప్రశ్నించారని తెలుస్తోంది. ఇలా అయితే కష్టమని.. రెట్టింపు వేగంతో పని చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నొక్కి మరీ చెప్పినట్లు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular