Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Birthday: చంద్రబాబు నాయుడు @ 75.. నారావారి పల్లె నుంచి నాయకత్వ శిఖరాల...

Chandrababu Birthday: చంద్రబాబు నాయుడు @ 75.. నారావారి పల్లె నుంచి నాయకత్వ శిఖరాల వరకు..

Chandrababu Birthday: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక సౌకర్యాలు లేని గ్రామంలో పుట్టిన ఆయన, పట్టుదలతో చదువుకుని, కష్టాలను అధిగమించి రాజకీయ రంగంలో దిగ్గజ నాయకుడిగా ఎదిగారు. చిన్నతనంలో పాఠశాలకు 16 కిలోమీటర్లు నడిచి వెళ్లడం, వర్షాకాలంలో వాగులు దాటడం వంటి సవాళ్లను ఎదుర్కొన్న ఆయన, క్రమశిక్షణ, దృఢ సంకల్పంతో తన లక్ష్యాలను సాధించారు. ఈ ఏడాది ఆయన 75వ జన్మదినం సందర్భంగా, ఆయన వ్యక్తిగత, రాజకీయ జీవితం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చేసిన కృషి.. రాజకీయ ప్రస్థానంపై స్పెషల్‌ స్టోరీ.

Also Read: ఆడియో రిలీజ్ చేసిన కసిరెడ్డి రాజ్.. విజయసాయి రెడ్డిపై సంచలన నిజాలు

చంద్రబాబు బాల్యం గ్రామీణ వాతావరణంలో, రైతు తండ్రి కర్జూరనాయుడు పొలంలో పనిచేస్తూ గడిచింది. నాగలితో దుక్కి దున్నడం, పశువుల మేతకు తీసుకెళ్లడం, అడవిలో పండ్లు కోయడం వంటి అనుభవాలు ఆయనకు జీవితంలో సామాన్యుల కష్టాలను అర్థం చేసుకునే దృక్పథాన్ని ఇచ్చాయి. తిరుపతి శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికై, యువతను సమీకరించడంలో తన నాయకత్వ పటిమను చాటారు. ఆర్థిక శాస్త్రంలో పీజీ పూర్తి చేసిన ఆయన, రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడం ద్వారా తన గ్రామ అభివృద్ధికి కృషి చేశారు, భీమవరం రోడ్డు నిర్మాణంలో శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

రాజకీయ జీవితం.. సవాళ్లు, విజయాలు
1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు, 28 ఏళ్ల వయసులో శాసనసభలో అడుగుపెట్టారు. 1980లలో రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖలను నిర్వహించారు. ఎన్టీఆర్‌తో బంధుత్వం ద్వారా తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, 1984లో ఎన్టీఆర్‌పై రాజకీయ కుట్ర సమయంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించారు. 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారు. 2024లో నాల్గవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఆయన, అమరావతిని ఏఐ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.

వినూత్న సంస్కరణలు.. సామాజిక చైతన్యం
చంద్రబాబు నాయుడు పాలనలో జన్మభూమి, శ్రమదానం, డ్వాక్రా సంఘాలు, దీపం పథకం వంటి కార్యక్రమాలు గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారతకు ఊతమిచ్చాయి. ఈ–సేవ, హైటెక్స్, విజన్‌ 2020 వంటి చొరవలతో ఆయన డిజిటల్‌ యుగానికి ఆంధ్రప్రదేశ్‌ను నడిపించారు. మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు ఆకర్షించడం, శంషాబాద్‌ విమానాశ్రయం నిర్మాణం వంటి నిర్ణయాలు ఆయన దూరదృష్టిని చాటాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో 2023లో 53 రోజుల జైలు శిక్ష అనుభవించినప్పటికీ, ఆయన పట్టుదలతో ప్రజల మద్దతుతో తిరిగి రాజకీయంగా ఉద్భవించారు. పీ4 పథకం, వాట్సప్‌ గవర్నెన్స్‌ వంటి కొత్త పథకాలతో ఆయన పేదరిక నిర్మూలన, సమర్థ పాలనకు కృషి చేస్తున్నారు.

చంద్రబాబు వ్యక్తిగత జీవితంలో కూడా సరళత, క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తారు. మాంసాహారం మానేసి, ఆరోగ్యకరమైన ఆహారం, యోగా, ధ్యానం వంటి అలవాట్లతో జీవనశైలిని కొనసాగిస్తున్నారు. భువనేశ్వరితో వివాహం, హెరిటేజ్‌ ఫుడ్స్‌ స్థాపన, కుటుంబ బాధ్యతల్లో భాగస్వామ్యం వంటివి ఆయన వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను చాటాయి. రాజకీయంగా ఆయన ఎదుర్కొన్న సవాళ్లు. 2003 అలిపిరి దాడి, 2019 ఎన్నికల ఓటమి, 2023 అరెస్టు ఆయన మానసిక దృఢత్వాన్ని, ప్రజలతో అనుబంధాన్ని నిరూపించాయి. ఆయన దృష్టి ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు చుట్టూ తిరుగుతుంది, ఇది ఆయనను ఫీనిక్స్‌లా ఆటుపోట్ల నుంచి పైకి లేపే శక్తిగా నిలుస్తుంది.

చంద్రబాబు నాయుడు మరెన్నో మైలురాళ్లు అధిగమిచాలని, మరిన్ని ప్రజా సంక్షేమ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, విజన్‌ 2047 కల సాకారం కావాలని ఆశిద్దాం. హ్యాపీ బర్త్‌డే చంద్రబాబు గారు..!

 

Also Read: ఈసారి విజయసాయిరెడ్డి ఏ బాంబు పేల్చుతారో?

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular