Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu And Revanth: బయటకే ఫైటింగ్.. లోపల అంతా మీటింగ్ నే.. చంద్రబాబు రేవంత్ కలయిక...

Chandrababu And Revanth: బయటకే ఫైటింగ్.. లోపల అంతా మీటింగ్ నే.. చంద్రబాబు రేవంత్ కలయిక వైరల్

Chandrababu And Revanth: మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం.. రాజకీయ నాయకులంతా ఒకే విధంగా ఉంటారని.. వారి వ్యక్తిగత సంబంధాల విషయంలో ఏమాత్రం తేడా జరగకుండా చూసుకుంటారని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉప్పు నిప్పులాగా ఉండేవారు. ఏదైనా వేడుకలు.. ఇతర సందర్భాల్లో అయితే కలివిడిగా ఉండేవారు. సరదాగా సంభాషించుకుంటూ కనిపించేవారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ తనకు అవసరమైతే తప్ప మిగతా సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులను దగ్గరికి తీసిన దాఖలాలు లేవు. వారితో సరదాగా మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే అప్పట్లో పరిటాల సునీత కుమారుడు వివాహానికి మాత్రం కెసిఆర్ వెళ్లారు. తాను నిర్వహించిన ఆయత చండీయాగానికి నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో చంద్రబాబు, కెసిఆర్ మధ్య విభేదాలు పెరిగినప్పటికీ.. ఇటీవల కెసిఆర్ కాలు విరిగి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందినప్పుడు చంద్రబాబు పరామర్శించారు. మొత్తంగా చూస్తే రాజకీయాలు వ్యక్తిగతంగా ఉండవని.. తమ వ్యక్తిగత సంబంధాలను ప్రభావితం చేయలేవని చంద్రబాబు, చంద్రశేఖర రావు నిరూపించారు. ఓటుకు నోటు కేసులో ఇంత గొంతు వేసుకొని అరిచిన వారంతా వారిద్దరిని చూసి ముక్కున వేలేసుకున్నారు.

ఇప్పుడు రేవంత్ వంతు…

ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. గత ఏడాది రెండు రాష్ట్రాల ప్రయోజనాల దృష్టిగా రేవంత్ చంద్రబాబును సచివాలయం వద్దకు పిలిపించుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవాల్సిన బకాయిల గురించి చర్చించారు. ఆ తర్వాత ప్రాధాన్య క్రమంలో మిగతా అంశాల గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇక ఇటీవల కృష్ణా జలాల పంపిణీ విషయంలో వివాదం రేకెత్తిన సమయంలో రెండు రాష్ట్రాల మంత్రులు పరిధి మేరకు విమర్శలు చేసుకున్నారు. అయితే కెసిఆర్, చంద్రబాబు హయాంలో చోటు చేసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా విభేదాలు ఏర్పడతాయా? అని అందరు అనుకున్నారు. అయితే అదంతా తూచ్ అని.. లోపల మేమంతా ఒకటేనని.. పైకి మాత్రమే విభేదాలని నేతలు స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం దావోస్ ప్రాంతంలో పెట్టుబడుల సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా వారి వారి మంత్రులతో కలిసి వేరువేరుగా దావోస్ బయలుదేరారు. ఈ సందర్భంగా వారు జ్యూరీచ్ లో కలుసుకున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మిత్రులు ఒక ఫోటో దిగారు. ఈ ఫోటో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గతంలో పెట్టుబడుల సదస్సుకు వెళ్ళినప్పుడు తెలంగాణ నుంచి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, ఇతర మంత్రులు వెళ్లినప్పటికీ… ఈ స్థాయిలో ఫోటోలు దిగలేదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. తెలంగాణ లో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకోలేదు. అయితే చంద్రబాబు, రేవంత్ కలిసి దిగిన ఫోటోలు టిడిపి, కాంగ్రెస్ పార్టీల నాయకులు సోషల్ మీడియాలో “అనుకూలమైన వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు.. తెలుగు రాష్ట్రాలు కూడా ఇలానే కలిసి ఉండాలని కోరుకుంటున్నట్టు” కామెంట్స్ చేస్తుండగా.. గులాబీ అనుకూల నెటిజన్లు మాత్రం తమ తమ భాష్యాలు చెబుతున్నారు. మొత్తానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి దిగిన ఫోటో తెలుగు రాజకీయాలలో సంచలనంగా మారింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version