Chandrababu And Jagan: ఏపీ ఎన్నికల్లో గట్టి ఫైట్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ సర్వే సంస్థలు మాత్రం.. వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఇస్తున్నాయి. మరికొన్ని సంస్థలు టిడిపి కూటమిదే అధికారమని తేల్చి చెబుతున్నాయి. అయితే ఈ సర్వేలో సైతం గట్టి ఫైట్ ఉంటుందని చెప్పుకొస్తున్నాయి.ఎలాగైనా విక్టరీ కొడతానని జగన్ భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను గద్దె దించుతామని చంద్రబాబు నేతృత్వంలోని విపక్షాలు చెబుతున్నాయి. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం ప్రత్యర్థి పార్టీని నిర్వీర్యం చేయాలని భావిస్తున్నారు. బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం భయపడుతున్నారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. ఒకవైపు చంద్రబాబుకు వయసు మల్లుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు వయో భారం తప్పదు. అందుకే ఈ ఎన్నికలు ఆయనకు అత్యంత కీలకం. అందుకే 2019 ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్నారు. విపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు. సీట్ల సర్దుబాటు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని పుష్కలంగా అందుకుంటున్నారు. వ్యవస్థల పరంగా మేనేజ్ చేస్తున్నారు. అయినా సరే ఎక్కడో ఒకచోట భయం ఆయన్ను వెంటాడుతోంది. తప్పకుండా అధికారంలోకి వస్తామని చెబుతున్నా.. ఫుల్ కాన్ఫిడెన్స్ ఆయన ముఖంలో కనిపించడం లేదు.
ఏపీ సీఎం జగన్ ది అదే పరిస్థితి. 175 అన్న నినాదంతో ఆయన ముందుకు వెళుతున్నారు. కానీ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ 90 సీట్లు వస్తే చాలు అన్న రీతిలో వైసీపీ నేతలు ఉన్నారు. క్రమేపి ఆయనలో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. అయితే ఆయనకు వయసు ఉంది. మరో రెండు దశాబ్దాలు రాజకీయం చేయగలరు. ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇబ్బంది పెట్టినా తట్టుకోగలరు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టిందో తెలియంది కాదు. దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. ఇప్పుడు ఆయనకు వేధిస్తే కొత్తగా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. జగన్ ప్రతిపక్షానికి సైతం సిద్ధంగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.ఒకవేళఈసారి అధికారంలోకి రాకున్నా.. వచ్చే ఎన్నికల్లో విజయం అందుకుంటానన్న ధీమా జగన్లో కనిపిస్తోంది. అయితే జగన్ తో పోల్చుకుంటే చంద్రబాబు పరిస్థితి విభిన్నం. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు. 2029 ఎన్నికల నాటికి ఆయన వయసు 82 కు చేరుకుంటుంది. ఆ వయసులో రాజకీయం చేయడం ఇబ్బందికరం. అందుకే ఈ ఎన్నికల్లో గెలిచి.. కుమారుడికి పట్టాభిషేకం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. అయితే పొరపాటున టిడిపికి ఓటమి ఎదురైతే మాత్రం.. ఆ పార్టీ కకావికలం అయినట్టే.