https://oktelugu.com/

Chandra Babu : ఢిల్లీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు.. హస్తినలో గృహప్రవేశం.. ఏం జరుగుతోంది!

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి. తొలిసారి ఎన్డీఏ ఎంపీల తో కలిసి ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలిశారు చంద్రబాబు. కీలక చర్చలు జరిపారు. ఈసారి కూడా ఇలా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారో లేదో బిజీగా మారిపోయారు. మరోవైపు ఢిల్లీ అవసరాలు తరచూ ఉంటాయని భావిస్తున్న చంద్రబాబు.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు

Written By:
  • Dharma
  • , Updated On : July 17, 2024 / 04:14 PM IST
    Follow us on

    Chandra Babu : చంద్రబాబు కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. రాజకీయపరమైన నిర్ణయాలు, పాలనాపరమైన వ్యవహారాల్లో బిజీగా మారిపోయారు. నిన్నటికి నిన్న క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయారు. నేరుగా హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కీలక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా వరుసగా విడుదల చేసిన శ్వేత పత్రాలపై అమిత్ షా కు వివరించారు. గత ఐదేళ్ల విధ్వంసం వారి మధ్య చర్చకు వచ్చింది. అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అధిక శాతం నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. దీనిపై అమిత్ షా స్పందించారు. ఇదే విషయాన్నిఎక్స్ వేదికగా పంచుకున్నారు చంద్రబాబు.

    సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం ఇది రెండోసారి. తొలిసారి ఎన్డీఏ ఎంపీల తో కలిసి ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలిశారు చంద్రబాబు. కీలక చర్చలు జరిపారు. ఈసారి కూడా ఇలా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారో లేదో బిజీగా మారిపోయారు. మరోవైపు ఢిల్లీ అవసరాలు తరచూ ఉంటాయని భావిస్తున్న చంద్రబాబు.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు.. 2015లో ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు బస చేసేందుకు 1 జనపధ్ లో అధికారిక నివాసాన్ని కేటాయించారు. అయితే చంద్రబాబు అందులో ఉండేందుకు అప్పట్లో ఇష్టపడలేదు. తాజాగా ఇక్కడి నుంచి అందులో ఉండాలని భావించి బుధవారం నాడు జనపధ్ నివాసంలో అడుగుపెట్టనున్నారు. 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఈ నివాసంలో సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్ల కోసం ఏపీ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ అప్పట్లో చంద్రబాబు ఇక్కడ ఉండేందుకు ఆసక్తి చూపేవారు కాదు.

    తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్వి రమణ ఉండే వారు. ఆయన నివాసం పక్కనే నెంబర్ టు జనపథ్ లో ఉండేది. అందుకే అనవసరమైన రాజకీయ విమర్శలకు తావు ఇవ్వకూడదని అప్పట్లో చంద్రబాబు అక్కడ ఉండేవారు కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఎప్పుడైనా ఢిల్లీ వెళ్తే అక్కడే ఉండేవారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి జనపధ్ లో బస చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు ఏపీ భవన్ లోనే ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వచ్చినప్పుడు ఉండడానికి అక్కడ సదుపాయాలు కల్పించారు. వాస్తు రీత్యా కొన్ని మార్పులు కూడా చేశారు.

    చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ రావడం ఇది రెండోసారి. తొలిసారి వచ్చినప్పుడు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలో ఉన్నారు. ఆయన అశోక రోడ్డులోని క్వార్టర్ నెంబర్ 50లో ఉంటున్నారు. గతంలో అక్కడ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఉండేవారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. అందుకే ఆ క్వార్టర్ భవనాన్ని రామ్మోహన్ నాయుడుకు కేటాయించారు. కానీ ఈసారి 1 జనపధ్ లో ఉండాలని చంద్రబాబు నిర్ణయించడంతో బుధవారం అక్కడ పూజలకు ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే ఢిల్లీలో చంద్రబాబుకు ఏర్పాటయిందన్నమాట.

    మరోవైపు చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గతసారి ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీని కలిశారు. ఈసారి మాత్రం ఇంతవరకు కలవలేదు. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యులను టిడిపిలోకి రప్పించేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. చాలామంది వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. బిజెపికి రాజ్యసభలో సంఖ్యా బలం తగ్గిన నేపథ్యంలో అమిత్ షా తో కలిసి.. వైసీపీ సభ్యుల చేరికపై చంద్రబాబు దృష్టి పెడతారని వార్తలు వచ్చాయి. అయితే ఢిల్లీలో ఒక్క అమిత్ షా తో మాత్రమే చంద్రబాబు చర్చలు జరపడం ఈ వార్తలకు ప్రాధాన్యత సంతరించుకుంది.