CBSE పదో తరగతి, 12వ తరగతి పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు కేంద్రం కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. విద్యార్థులపై భారం తగ్గించేందుకు, నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరం నుంచి సరికొత్త పరీక్షల విధానం అమలు చేసేలా వ్యూహ రచన చేయాలని సీబీఎస్‌ఈని ఆదేశించింది. ఈ నేపథ్యంలో 12వ తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
రెండుసార్లు పరీక్షలు..
12వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు వార్షిక పరీక్షలు నిర్వహించాని సీబీఎస్‌ఈ భావిస్తోంది. ఒకసారి మార్చిలో, రెండోసారి జూన్‌లో పరీక్షలు నిర్వహించే అంశాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది. అధికారికంగా ప్రకటన రాకపోయినా… విశ్వసనీయ సమాచారం మేరకు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి.
కుదరని ఏకాభిప్రాయం..
ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో ఇటీవల సీబీఎస్‌ఈ విస్తృత సంప్రదింపులు జరిపింది. ఇందులో సెమిస్టర్ విధానంపై చర్చించగా.. ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో పాతపద్ధతిలోనే ఫిబ్రవరి లేదా మార్చిలో 12వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించి.. జూన్‌లో కూడా మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలను కేంద్ర విద్యాశాక దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇలా…
సీబీఎస్‌ఈ ప్రస్తుతం 12వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి–మార్చిలో బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. మే నెలలో ఫలితాలు వెల్లడిస్తోంది. ఆ తర్వాత విద్యార్థులు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయితే, మార్కులు పెంచుకోవాలనుకునే వారి కోసం సప్లిమెంటరీ పరీక్షల నిర్వహిస్తోంది. పాస్ కానివారు కంపార్ట్‌మెంట్ విద్యార్థులకు సప్లిమెంటరీ రాశే అవకాశం ఉంది.
కొత్త విధానం అమలులోకి వస్తే..
ఇక సీబీఎస్‌ఈ కొత్త విధానం అమలులోకి వస్తే..మార్చిలో పరీక్షలు రాసిన విద్యార్థులు జూన్‌లో మరోసారి అన్ని పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. అయితే ఇది పూర్తిగా విద్యార్థుల ఆప్షన్ మాత్రమే. తప్పనిసరి కాదు. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్తులు ఉత్తమ స్కోర్‌ను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెండోసారి అన్ని పరీక్షలు కాకుండా తమకు తక్కువ మార్కులు వచ్చిన ఒకటి లేదా రెండు పరీక్షలు కూడా రాసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు సమాచాం. దీనిపై త్వరలో కేంద్రం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఇదే తొలిసారి కాదు..
ఇక సీబీఎస్‌ఈ పరీక్షలను సంస్కరించడం ఇదే తొలిసారి కాదు. 2009లో పదో తరగతికి సీసీఈ( కంటిన్యూస్, కాంప్రెహెన్సివ్ ఎవల్యూషన్) విధానం ప్రవేశపెట్టింది. 2017లో దీనిని ఎత్తివేసి మళ్లీ పాత విధానాన్నే అమలు చేసింది. కోవిడ్ సమయంలో 10, 12వ తరగతి విద్యార్థుల వార్షిక పరీక్షలను ఏడాదికి రెండు విడతలుగా నిర్వహించింది. కోవిడ్ తర్వాత మళ్లీ పాత విధానం అమలు చేస్తోంది. తాజాగా సెమిస్టర్ విధానంలో పరీక్షలను ప్రతిపాదించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేసే అవకాశం ఉంది.