TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా భక్తులకు సౌకర్యాల పెంపు పై ఫోకస్ పెంచారు. గత ఐదేళ్లుగా ఈవోగా ధర్మారెడ్డి ఉండగా.. ఆయనను తాజాగా సాగనంపారు. ఆయన స్థానంలో శ్యామలరావును తీసుకొచ్చారు. విప్లవాత్మక నిర్ణయాలతో శ్యామల రావు ముందుకు సాగుతున్నారు. భక్తుల సౌకర్యాలతో పాటు అన్నప్రసాదం విషయంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ప్రసాదాలు తయారుచేసి ఓటు కార్మికుల విధుల గురించి సుదీర్ఘంగా అధ్యయనం చేశారు.అన్న ప్రసాదాల నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. జూలై 9న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనాన్ని నిర్వహిస్తారు. ఉగాది, అణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు ఐదు గంటలపాటు కొనసాగుతుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు అగమోక్తంగా పూజాధి కార్యక్రమాలు చేపడతారు.
కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నేపథ్యంలో జూలై 9, 16 తేదీల్లో బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జూలై 8,15 తేదీల్లో సిఫారసు లేఖలను సైతం టీటీడీ స్వీకరించదు. ఈ విషయాన్ని టిటిడి స్వయంగా ప్రకటించింది. భక్తులు ఈ అసౌకర్యాన్ని గమనించాలని సూచించింది. ఆ రెండు రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. కాగా అన్న ప్రసాదం నాణ్యత పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఈవో శ్యామలరావు పోటు కార్మికుల విధులపై అధ్యయనం చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులకు వివరించే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అన్న ప్రసాదం విషయంలో విమర్శలు రాకుండా చూసుకోవాలని.. అటువంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈవో శ్యామలరావు.