Deputy CM Pawan Kalyan : కాకినాడ నుంచి బియ్యంతో తరులుతున్న షిప్ పట్టుబడిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ షిప్ ను పరిశీలించారు. సీజ్ ది షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇది దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయింది. ముందు షిప్ సీజ్ చేయండి.. కేంద్రంతో నేను మాట్లాడుతానంటూ చెప్పుకొచ్చారు పవన్. అయితే ఈ షిప్ లో బియ్యం ఎగుమతుల పైన అధికారుల లెక్కలు.. రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కీలక సూచన చేసింది. షిప్ నిలిపివేత సరికాదని తేల్చింది. దీంతో పరోక్షంగా పవన్ కు కేంద్రం షాక్ ఇచ్చినట్లు అయింది. పవన్ ఎంతో సీరియస్ గా సీజ్ ది షిప్ అని ఆదేశాలిస్తే.. అది సరికాదు అంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడం ఇప్పుడు సంచలనం గా మారింది.
* పవన్ స్పష్టమైన ఆదేశాలు
కొద్ది రోజుల కిందట కాకినాడ నుంచి ప్రజా పంపిణీకి వినియోగించి బియ్యం రవాణా పై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరుగా సముద్రంలోకి వెళ్లి షిప్ లో రవాణా చేస్తున్న బియ్యాన్ని పరిశీలించారు. ఆ రోజునే సీజ్ ది షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. షిప్ ను చూడకుండా తనను అడ్డుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. కాకినాడ పోర్టుకు రాకుండా తనపై ఒత్తిడి వచ్చిందని కూడా గుర్తు చేశారు. అయితే ఈ బియ్యం పై పూర్తిస్థాయి విచారణ తరువాత కాకినాడ జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. ఏం మేర బియ్యం ఎగుమతుల పేరుతో తరలిస్తున్నది వివరించే ప్రయత్నం చేశారు.కాగా పవన్ పర్యటన తర్వాత ప్రత్యేక అధికారుల బృందం సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. అయితే అదే సమయంలో షిప్ సీజ్ చేసే అధికారం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ స్పందించింది. ఏపీ ప్రభుత్వంతో పాటు కాకినాడ కలెక్టర్ కు లేఖ రాసింది. అందులో ఆఫ్రికా తో ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దని సూచించింది. తనిఖీల పేరుతో ఆటంకాలతో దేశానికి ఇబ్బంది వస్తుందని కూడా గుర్తు చేసింది. ఆకలి నివారణ కోసం ఆఫ్రికా తో డీల్ చేసుకున్న విషయాన్ని మరి గుర్తు చేసింది కేంద్ర ప్రభుత్వం.
* విపక్షాలకు ప్రచార అస్త్రం
అయితే ఏకంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ లేఖలు రాయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. అయితే ఇంత హడావుడి నడిచాక.. ఇప్పుడు ఊరుకుంటే అది విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారుతుందని కూటమి పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం దందా వెనుక వైసీపీ నేతల హస్తము ఉందన్నది కూటమి నుంచి వస్తున్న ఆరోపణలు. సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం.. కాకినాడ పోర్టు నుంచి తరలుతున్న రేషన్ బియ్యం లో కలుగజేసుకోవద్దని పరోక్ష హెచ్చరికలు రావడం విశేషం. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.