Twist in Parakamani case: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నాయకులకు కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. టీటీడీ లడ్డు వివాదం నుంచి కల్తీ మద్యం కేసు వరకు వారిపై కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో కుంభకోణాల కంటే అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నేతల వ్యవహార శైలి మూలంగా కేసులు నమోదవుతుండడం విశేషం. తాజాగా తిరుమల పరకామణి కేసులో టీటీడీ మాజీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి కి నోటీసులు ఇచ్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం. విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో కరుణాకర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించినట్లు అవుతోంది. ఎందుకంటే ఆయన టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే పరకామణి ఘటన జరిగింది. అందుకే తాజాగా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
విచారణకు వస్తుండగా మృతి..
పరకామణి చోరీ కేసులో రవికుమార్( Ravi Kumar) నిందితుడు. అప్పటి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదుదారుడు. అయితే మధ్యలో లోక్ అదాలత్ లో ఫిర్యాదుదారుడిగా ఉన్న సతీష్ రెడ్డి కేసు రాజీ చేసుకున్నారు. దీంతో కేసు కొట్టివేతకు గురయింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలు అయింది. దీంతో కోర్టు విచారణకు ఆదేశించడంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. లోతైన విచారణ జరుగుతున్న సమయంలో ఫిర్యాదు చేసి రాజీ చేసుకున్న సీఐ సతీష్ కుమార్ ను విచారించింది సిట్. రెండోసారి విచారణకు వస్తుండగా మార్గమధ్యలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
ఆత్మహత్యగా ఎలా తెలుసు?
అయితే సతీష్ కుమార్( Satish Kumar) అనుమానాస్పద మృతి పై అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. హత్య ఆనవాళ్లు కనిపించాయి. కానీ ఈ ఘటన జరిగిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. సతీష్ ది ఆత్మహత్యగా పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసులు హత్య కోణంలో విచారణ చేస్తుంటే ఆత్మహత్యగా ఎలా పరిగణిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్న. అలాగే టిటిడి పరకామణి నగదు చోరీకి సంబంధించిన కేసు రాజీ చేస్తుంటే టీటీడీ అధ్యక్షుడిగా ఏం చేస్తున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం అడిగే అవకాశం ఉంది. ఒకవైపు ఈ చోరీ కేసులో టీటీడీ పాత్రతో పాటు సతీష్ మరణం పై ఆత్మహత్యగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని.. భూమన కరుణాకర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించే అవకాశం ఉంది.