https://oktelugu.com/

YS Jagan : జగన్ కు గుడ్ న్యూస్.. కానీ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి ఇవ్వాల్సిందే!

ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. టిడిపి కూటమి ఘన విజయం సాధించింది. కొత్త ప్రభుత్వం 80 రోజుల పాలన పూర్తి చేసుకుంది. దీంతో ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి పోరాటం చేయాలని జగన్ నిర్ణయించారు. ఇంతలో విదేశాలకు వెళ్లాలని భావిస్తున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : August 28, 2024 / 10:21 AM IST

    YS Jagan

    Follow us on

    YS Jagan  : ఏపీ మాజీ సీఎం జగన్ కు సిబిఐ కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అక్రమాస్తుల కేసుల్లో జగన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ కేసులో 16 నెలల పాటు జైలులో కూడా గడిపారు. ఆదాయానికి మించి ఆస్తులను కూడా పెట్టారని.. తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేశారన్నది జగన్ పై ఉన్న ఆరోపణలు. 16 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్.. గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారు. 2019 ఎన్నికల వరకు ప్రతి శుక్రవారం కోర్టు విచారణకు హాజరయ్యేవారు.కానీ ఈ రాష్ట్రానికి సీఎం కావడంతో ఆయనకు మినహాయింపు లభించింది. ప్రతి శుక్రవారం విచారణకు హాజరయ్యే పరిస్థితి నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడు అధికారం పోవడంతో పాటు ఈ కేసులో సిబిఐ పట్టు బిగిస్తోంది. మరోవైపు న్యాయస్థానం సైతం వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సిబిఐకి ఆదేశించింది. ఈ నేపథ్యంలో జగన్ తన కుమార్తె పుట్టినరోజు నిమిత్తం లండన్ వెళ్లేందుకు కోర్టు అనుమతి కోరారు. అయితే ఈ కేసు విచారణ సక్రమంగా జరగడం లేదని.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు విచారణకు సహకరించడం లేదని సిబిఐ అధికారులు ఇటీవల కోర్టుకు తెలియజేశారు. అందుకే జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వొద్దని సిబిఐ కోర్టును కోరింది. అయితే తన కుమార్తె పుట్టినరోజు కోసం విదేశాలకు వెళ్లడానికి అవకాశం ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించి అర్జీ సమర్పించుకున్నారు. ఇరువర్గాల వాదనలను న్యాయస్థానం వినింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లేందుకు జగన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది.

    * విచారణలో జాప్యం
    జగన్ పై అక్రమాస్తుల కేసులకు సంబంధించి గత కొన్నేళ్లుగా విచారణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల కేసులో జాప్యం పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ తీరును ప్రశ్నించింది. ఎందుకు జాప్యం జరుగుతోందని తెలుసుకునే ప్రయత్నం చేసింది. సిబిఐ చెబుతున్న సమాధానాలు సహేతుకంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణను వేగవంతం చేయాలని ఆదేశించింది. ఈ తరుణంలో సిబిఐ కోర్టు జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతించదని అంతా భావించారు. కానీ వివిధ షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేయడం విశేషం.

    * పాస్పోర్ట్ కు అనుమతి
    ఐదేళ్ల కాల పరిమితితో పాస్ పోర్ట్ తీసుకునేందుకు జగన్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. విదేశాలకు అనుమతి ఇచ్చిన కోర్టు జగన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ వివరాలు సిబిఐకి, కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. మొత్తం మీద జగన్ విదేశీ పర్యటనకు సిబిఐ ప్రత్యేక కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆయన విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మేలో ఎన్నికల పోలింగ్ జరిగిన వెంటనే ఆయన విదేశాలకు వెళ్లారు. కౌంటింగ్ కు ముందు రాష్ట్రానికి చేరుకున్నారు. ఇప్పుడు మరోసారి విదేశాలకు వెళ్తున్నారు.

    * ఎంపీ విజయసాయిరెడ్డి సైతం
    మరోవైపు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సైతం విదేశాలకు వెళ్లేందుకు కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల పాటు తాను విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు విచారణ చేపట్టి ఈనెల 30కి వాయిదా వేసింది. జగన్ అక్రమాస్తుల కేసులు విజయసాయిరెడ్డి ఎ2గా ఉన్న సంగతి తెలిసిందే. జగన్ తో పాటు 16 నెలల పాటు జైల్లో ఉండి పోయారు కూడా. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి తప్పనిసరి కావడంతో కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. జగన్ కు అనుమతి లభించిన నేపథ్యంలో.. విజయసాయి రెడ్డికి సైతం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని తెలుస్తోంది.