Visakha City Task Force : విశాఖ మహానగరం…ఇందులో రెండో మాటకు తావులేదు. ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖ గుర్తింపుపొందింది. కాస్మోపాలిటన్ కల్చర్ తో దేశంలో టాప్ టెన్ సీటీల్లో ఒకటి కావడం గమనార్హం. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ తరువాత నిలిచేది కూడా సాగర నగరమే. విభజిత ఏపీలో ఏకైక మెగా సిటీ కూడా ఇదే. ప్రశాంతతకు మారుపేరు. అందుకే ఇక్కడికి వచ్చేందుకు పర్యాటకులు ఇష్టపడతారు. సేదదీరేందుకు మొగ్గుచూపుతారు. పర్యాటక బ్రాండ్ అంబాసిడర్ గా విశాఖకు మంచి పేరుంది. కానీ గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలు విశాఖ ప్రభను మసకబారుస్తున్నాయి.
నేర సంస్కృతి పెరుగుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. సువిశాల సాగర తీరం, ఆపై కేంద్ర సంస్థలతో విశాఖ అభివృద్ధి చెందిన నగరాల సరసన చేరింది. ఉత్తరాధి రాష్ట్రల ప్రభావం ఉన్నా.. నేరాల సంఖ్య మాత్రం అంతంతమాత్రమే. చెదురుమదురు ఘటనలు మినహా.. నగర బ్రాండ్ ను చెరిపే నేరాల నమోదు కూడా చాలా తక్కువే. ఇతర రాష్ట్రాల వ్యక్తులు, వ్యవస్థలు విశాఖ నగరంలో ప్రవేశించినా.. ఇక్కడి శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన సందర్భాలు లేవు. కానీ ఇటీవల రాయలసీమ కల్చర్ పెరిగిన తరువాత.. వాటి పర్యవసానాలు విపరీత ప్రభావాన్ని చూపుతున్నాయి. అందులో ప్రజాప్రతినిధుల కుటుంబాలు కూడా బాధితులుగా మిగులుతున్నాయి.
కొద్దిరోజుల కిందటే ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ ఘటన సాగర నగరాన్ని వణుకు పుట్టించింది. కిడ్నాప్ నకు గురై 24 గంటల తరువాత కానీ ఆ విషయం సంబధిత ప్రజాప్రతినిధికి సమాచారం లేదు. అయితే ఇది డబ్బు కోణంలో జరిగిన కిడ్నాప్ అని చెబుతున్నా.. తెరవెనుక మంత్రాంగాలపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధి, ఆపై పేరుమోసిన రియల్టర్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కానీ బయటకు రాని చాలా ఘటనలు సాగర నగరంలో జరుగుతున్నాయని ఒక టాక్ ఉంది. భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు వంటివి పెరిగాయన్నది బహిరంగ రహస్యం. అయితే ఇవి వైసీపీ సర్కారు విశాఖ పాలనా రాజధానిగా నిర్ణయం తీసుకున్నాక మాత్రమే జరుగుతున్నాయన్న అపవాదు ఒకటి ప్రబలంగా వినిపిస్తోంది.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమికి ప్రజల్లో ఈ రకమైన భయమే కారణమన్న విశ్లేషణులు అప్పట్లో వెలువడ్డాయి. ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ తరువాత ఇది మరింత పెరిగింది. ప్రభుత్వం సాగర నగరం ప్రజలపై ఏవగింపు ప్రారంభమైంది. దీనిని గుర్తించిన జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేసులు అన్నీ కూడా టాస్క్ ఫోర్స్ పరిధిలోకి తీసుకువచ్చింది. రాష్ట్ర హోం శాఖ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక మీదట వివిధ పోలీస్ స్టేషన్లలో విడిగా దర్యాప్తు చేసే కేసులు అన్నీ ఇపుడు టాస్క్ ఫోర్స్ కే వెళ్తాయి. అక్కడే విచారణ చేస్తారు మే నెల 23 నుంచి అన్ని కేసులూ టాస్క్ ఫోర్స్ పరిధిలోకే అంటూ ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు. దాంతో విశాఖలో ఇక మీదట కేసులన్నీ టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఫోకస్ తో టేకప్ చేస్తారన్న మాట. అయితే పోలీస్ వ్యవస్థలనే తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న వారికి టాస్క్ ఫోర్స్ ఒక లెక్క అన్న మాట వినిపిస్తోంది..