Budameru: బుడమేరు కట్ట తెగిందా? మరోసారి ప్రమాదం ఉందా? ఇప్పుడు విజయవాడలో ఇదే చర్చ నడుస్తోంది. బుడమేరు కట్ట తెగిందన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో విజయవాడ ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. చాలామంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. విజయవాడ నగరం మధ్యలో వెళ్తున్న బుడమేరు పొంగి.. అపార నష్టం కలిగింది. లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. దాదాపు 40 మంది వరకు చనిపోయారు. అందుకే బుడమేరు పేరు చెబితే విజయవాడ నగరవాసులు చిగురుటాకులా వణికిపోతున్నారు. మరోసారి బుడమేరు కట్ట తెగిందని ప్రచారం జోరుగా సాగుతుండడంతో ఇళ్లకు తాళాలు వేసి..ప్రజలు వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిపోవడం కనిపించింది.అయితే అది ప్రచారమేనని.. అందులో నిజం లేదని ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి నారాయణ నేరుగా స్పందించారు. అటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రకటన చేశారు. ఇటువంటి వదంతులను ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* విజయవాడకు అపార నష్టం
బుడమేరు రికార్డు స్థాయిలో ప్రవహించడంతో విజయవాడ నగర ప్రజలకు అపార నష్టం కలిగింది. సగానికి పైగా నగరం మొత్తం నీటిలో మునిగిపోయింది. విజయవాడలోని శివారు ప్రాంతాలకు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రధానంగా సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్న, విజయవాడ వన్ టౌన్, కృష్ణలంక, ఇబ్రహీంపట్నం లలో వరద బీభత్సం సృష్టించింది. ప్రధానంగా బుడమేరు వాగు తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. దాని కట్ట తెగిపోవడంతో విజయవాడ ను ముంచేత్తుతోంది. చాలామంది ప్రజలు మునిగిపోయిన ఇళ్లలోనే చిక్కుకుపోయారు. ఎన్డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి కాపాడాయి. హెలిక్యాప్టర్లలో బాధితులను కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
* తొలిసారిగా ప్రళయం
మొన్నటి వరకు బుడమేరు చిన్న వాగు మాత్రమే. విజయవాడ నగరం మధ్యలో వెళ్తుంది ఈ నది. అయితే ఇప్పటివరకు ఆహ్లాదాన్ని పంచిన ఈ వాగు.. తొలిసారిగా ప్రళయం సృష్టించింది. మైలవరం కొండల్లో పుట్టి.. కొల్లేటి సాగర్లో కలుస్తుంది ఈ వాగు.అయితే ఈ వాగు ఆక్రమణలకు గురికావడంతోనే వరదలు బీభత్సం సృష్టించినట్లు తెలుస్తోంది.ఈ వాగు కట్టు తెగడంతోనే భారీ ప్రమాదం సంభవించడంతో.. ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
* ఉత్త ప్రచారమే
అయితే బుడమేరు ఆగ్రహం విజయవాడ నగర ప్రజల పాలిట శాపంగా మారింది. విపత్తు నుంచి తేరుకుంటున్న నగర ప్రజలకు.. ఇప్పటికీ ఆ జలప్రళయం కళ్ళేదుటే కనిపిస్తోంది.అయితేఈ బుడమేరు వాగు కట్ట తెగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో వరద బాధిత ప్రాంతాల ప్రజలు పరుగులు తీయడం కనిపించింది. అయితే అది ఉత్త ప్రచారమేనని తేలడంతో కొంత ఉపశమనం చెందారు. ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టింది. ప్రత్యేక ప్రకటన విడుదల చేయడంతో ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.