Thota Chandrasekhar: కెసిఆర్ పార్టీ జాతీయ పార్టీగా మారిన క్రమంలో ఏపీ నుంచి చాలామంది నేతలు ఆ పార్టీ వైపు వెళ్లారు. ఒక్క ఏపీ మాత్రమే కాదు పక్కనే ఉన్న ఒడిస్సా నుంచి కూడా కొంతమంది నేతలు చేరారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత భారత రాష్ట్ర సమితి పూర్తిగా కనుమరుగు అయ్యింది. మరోవైపు పాత తెలంగాణ రాష్ట్ర సమితిని పునరుద్ధరించేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో భారత రాష్ట్ర సమితిలో చేరిన నేతలు పునరాలోచినలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి బిఆర్ఎస్ లో చేరి ఏపీ బాధ్యతలు తీసుకున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పూర్వశ్రమం జనసేన. ఇప్పుడు బీఆర్ఎస్ కనుమరుగు కానుండడంతో తోట చంద్రశేఖర్ తిరిగి జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది.
* సీనియర్ ఐఏఎస్ అధికారిగా..
రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా తోట చంద్రశేఖర్ అందరికీ సుపరిచితులు. చాలా రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. జనసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2019లో జనసేన తరఫున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2023 తెలంగాణ ఎన్నికల కు ముందు కెసిఆర్ తన పార్టీని భారత రాష్ట్ర సమితిగా విస్తరించారు. జాతీయ పార్టీగా ప్రకటించి వివిధ రాష్ట్రాల నుంచి నేతలను పార్టీలో చేర్పించుకొని బాధ్యతలు అప్పగించారు. ఏపీ నుంచి జనసేన లో ఉన్న తోట చంద్రశేఖర్ ను తెచ్చి రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఓడిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సైతం దారుణ పరాజయం ఎదురయింది కేసీఆర్ పార్టీకి. అయితే ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకున్న క్రమంలో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి పునరుద్ధరణ పై నాయకత్వం దృష్టిసారించింది. దీంతో వివిధ రాష్ట్రాలలో పార్టీలో చేరిన వారంతా రాజకీయ అవకాశాలు వెతుక్కుంటూ ఇతర పార్టీలవైపు వెళుతున్నారు.
* పవన్ కళ్యాణ్ తో భేటీ..
మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కొంతకాలంగా రాజకీయాలు దూరంగా ఉంటున్న ఆయన ఉన్నట్టుండి పవన్ వద్ద కనిపించారు. దీంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. తోట చంద్రశేఖర్ మళ్ళీ జనసేనలో చేరుతున్నారని ప్రచారం మొదలైంది. మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన చంద్రశేఖర్ సీనియర్ ఐఏఎస్ అధికారి. 2008లోనే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆదిత్య హైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపనలో కూడా కీలక పాత్ర పోషించారు. జనసేన లో సైతం క్రియాశీలక పాత్ర పోషించిన ఆయన 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేశారు కూడా. మధ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. మెగా ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి ఆయనకు. అయితే తోట చంద్రశేఖర్ ద్వారా ఏపీలో కాపులను ఆకర్షించాలని చూశారు కెసిఆర్. కానీ అది వర్కౌట్ కాకపోగా స్వరాష్ట్రంలో సైతం భారత రాష్ట్ర సమితి ఓడిపోయింది. దీంతో ఆ పార్టీలో చేరిన వారంతా ఒక్కొక్కరు పార్టీకి దూరమవుతున్నారు.
