Brides Wanted Banners: పెళ్లెప్పుడు అవుతుంది బాబూ.. నాకు పిల్లను ఎవరు ఇస్తారు బాబూ.. కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులో విడుదలైన ఓ సినిమాలో విపరీతమైన పాపులారిటీని పొందిన పాట అది. ఇప్పటి పరిస్థితిని ఊహించే దశాబ్దాల క్రితమే రచయితలు ఆ పాటను రాశారు.. అప్పట్లో పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ.. ఇప్పుడైతే ఆ పాటకు తగ్గట్టుగానే ఉంది.
దేశంలో ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అని తేడా లేదు. ఈ కులం, ఆ కులం అనే వ్యత్యాసం లేదు.. ఇక మతాల గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అన్ని చోట్ల కూడా అమ్మాయిల కొరత ఉంది. ముఖ్యంగా పెళ్లీడుకు వచ్చిన అబ్బాయిలు.. అమ్మాయిలు లభించక వంటికాయ సొంటి కొమ్ములుగా మిగిలిపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అమ్మాయిల జననం చాలావరకు తగ్గిపోయింది. అబ్బాయిల మీద ప్రేమ.. వరకట్నం, భ్రూణ హత్యలు పెరిగిపోవడంతో అమ్మాయిల జననం తగ్గిపోయింది. ఇదే సమయంలో అబ్బాయిల సంఖ్య పెరిగిపోయింది. లింగ వ్యత్యాసం పెరిగిపోవడంతో చాలామంది అబ్బాయిలు వివాహాలు కాకుండానే మిగిలిపోతున్నారు. చాలామంది అబ్బాయిలు పెళ్లిళ్లు కాకపోవడంతో మ్యాట్రిమోనల్ వెబ్ సైట్ లను ఆశ్రయిస్తున్నారు. కులంతో సంబంధం లేకుండా.. వరకట్నంతో పని లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరైతే పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో ఒంటరిగానే మిగిలిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాయలసీమ ప్రాంతంలో కనుమ రోజున వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరి పల్లి ప్రాంతంలో యువకులు చేసిన వినూత్నమైన పని ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదే సమయంలో పెళ్లిళ్లు కాని యువకుల పరిస్థితి ఎంతటి దయనీయంగా ఉందో కళ్ళకు కట్టింది. కలికిరిపల్లి గ్రామంలో గ్రామంలో యువకులకు వివాహాలు జరగకపోవడంతో వారంతా కూడా తమ విద్యాభ్యాసాలను, పనిచేస్తున్న కంపెనీలు, సంపాదిస్తున్న వేతనం ఇతర వివరాలను ఫ్లెక్సీ పై ఏర్పాటు చేశారు. తమకు కులంతో సంబంధం లేదని.. కట్నాలు కానుకలు అవసరం లేదని.. అమ్మాయిని ఇస్తే చాలని అందులో పేర్కొన్నారు. వరకట్నాల వల్ల తమలాంటి యువకులకు పెళ్లిళ్లు కావడం లేదని.. అందువల్లే తాము కట్నం తీసుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించడం లేదని ఆ యువకులు ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. పేరుకు అది ఫ్లెక్సీ అయినప్పటికీ. . నేటి కాలంలో వివాహాలు జరగని యువకులు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో.. కలికిరిపల్లి లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వెల్లడిస్తోందని.. స్థానికులు చెబుతున్నారు. ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతుంది.