Bangladesh out of T20 World Cup: ఐసీసీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దలు మంకు పట్టు వీడలేదు. పైగా భారతదేశంలో లేని భద్రతా లోపం కారణాలను చూపిస్తూ టి20 వరల్డ్ కప్ నుంచి తాము తప్పుకుంటున్నట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే వేదికలు ఖరారు కావడం.. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడంతో ఇప్పటికిప్పుడు కొత్తగా షెడ్యూల్ మార్చడం ఇబ్బంది అవుతుందని ఐసిసి వెల్లడించింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దలు మనసు మార్చుకోలేదు.
కొద్దిరోజులుగా బంగ్లాదేశ్ లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అక్కడ హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. హిందువులపై జరుగుతున్న దాడుల్లో ఇప్పటికే కొంతమంది చనిపోయారు. దీనిపై సహజంగానే భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులను చక్కదిద్దాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలోనే భారత దేశంలో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరింది. దానికి భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీనికి తోడు ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్తో స్నేహం చేయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ నుంచి యుద్ధ నౌకలను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. అంతటితోనే బంగ్లాదేశ్ ఆగలేదు.. భారత్ మీద పీకల దాకా కోపంతో ఉన్న ఆ దేశ పెద్దలు క్రికెట్ లో లేని రాజకీయాలను తీసుకొచ్చారు.
అక్కడికి తాత్కాలిక ప్రభుత్వం ఒత్తిడితో బంగ్లాదేశ్ క్రికెట్ పెద్దలు భారతదేశంలో నిర్వహించే టి20 వరల్డ్ కప్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్దిరోజులుగా తమ జట్టు ప్లేయర్లు భారతదేశంలో ఆడబోరని సంకేతాలు ఇచ్చారు. దీనిపై అనేక పర్యాయాలు ఐసిసికి ఫిర్యాదు చేశారు. పాకిస్తాన్ మాదిరిగానే.. తమ జట్టు ప్లేయర్లు కూడా శ్రీలంకలో ఆడతారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసిసికి స్పష్టం చేసింది. అయితే ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వినతిని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దలు టి20 వరల్డ్ కప్ నుంచి తమ జట్టు తప్పుకుంటున్నదని ప్రకటించారు.
బంగ్లాదేశ్ t20 వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ జట్టు ఆడుతుందని icc పెద్దలు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆడే జట్లకు సంబంధించి ఇటీవల నిర్వహించిన సెలక్షన్ టోర్నీలలో స్కాట్లాండ్ జట్టు మెరుగైన ఆట తీరు ప్రదర్శించింది. బంగ్లాదేశ్ పక్కకు తప్పుకున్న నేపథ్యంలో.. ఆ తర్వాత స్థానంలో స్కాట్లాండ్ ఉన్న నేపథ్యంలో.. ఆ జట్టుకు ఆడే అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది ఏమైనప్పటికీ బంగ్లాదేశ్ తప్పుకోవడం.. స్కాట్లాండ్ జట్టుకు వరం లాగా మారింది.