TDP Janasena Alliance: టిడిపి తో జనసేన కటీఫ్ చెప్పనుందా? పొత్తుకు విఘాతం కలిగిందా? ఢిల్లీకి పవన్ వెళ్ళనున్నారా? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చి నడుస్తోంది. అటు వైసిపి అనుకూల మీడియా ఇదే తరహా ప్రచారం చేస్తోంది. టిడిపికి చెప్పకుండా పవన్ రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఈ ప్రచారం ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి పవన్ సిద్ధపడ్డారని.. ఏకంగా ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలతో చర్చలు జరపనున్నారన్నది ఈ ప్రచారం సారాంశం.
చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 25 పార్లమెంటు స్థానాల్లో.. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఈ సభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు కొన్నిచోట్ల పరోక్షంగా టిడిపి అభ్యర్థులు విషయమై సంకేతాలు ఇస్తున్నారు. అయితే మండపేట, అరకు నియోజకవర్గాల్లో ఓపెన్ అయ్యారు. అయితే అరకు వరకు పర్వాలేకున్నా.. మండపేట విషయంలో జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఆ సీటును జనసేన ఆశిస్తూ ఉండడమే అందుకు కారణం. దీనిపై పవన్ కు స్థానిక జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.
అయితే ఒక వైపు సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాకమునుపే చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు అలా వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేశారు. అందుకే జనసేన తరఫున అభ్యర్థులను రెండు నియోజకవర్గాల్లో ప్రకటించారు. అదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు మాత్రం సజావుగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం పొత్తు పరిరక్షణలో భాగంగానే తాను ఈ చర్యలకు దిగినట్లు సమర్ధించుకున్నారు. అప్పటినుంచి వైసిపి అనుకూల మీడియా రెచ్చిపోయింది. ఎవరికి వారే తమకు అనుకూలంగా విశ్లేషణలు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్ళనున్నారని.. టిడిపి తో బ్రేకప్ చెప్పి బిజెపితో మాత్రమే చేతులు కలపనున్నారని.. వైసిపి అనుకూల మీడియా, అధికార పార్టీకి అనుకూలంగా విశ్లేషించే ప్రతినిధులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. అయితే అందులో నిజం లేదని టిడిపి తో పాటు జనసేన వర్గాలు చెబుతున్నాయి. రెండు పార్టీల మధ్య వచ్చిన చిన్నపాటి సమాచార లోపాన్ని వైసిపి భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తోందని.. దానిని నమ్మవద్దని రెండు పార్టీల నాయకత్వాలు శ్రేణులకు సూచించినట్లు తెలుస్తోంది.
— Inturi Ravi Kiran (@InturiKiran7) January 25, 2024