K Vishwanath Wife Passed : సతీసహగమనం అంటే బహుశా ఇదేనేమో. ఆ ఉత్తమ ఇల్లాలు భర్త మరణించి నెల రోజులు ముగియకుండానే ఆయన్ని కలుసుకోవడానికి నింగికేగింది. కే విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి నేడు కన్నుమూశారు. ఈ మేరకు సమాచారం అందుతుంది. చాలా కాలంగా జయలక్ష్మి మంచానికి పరిమితమయ్యారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. దానికి తోడు భర్త దూరమైన మానసిక వేదన కూడా ఎక్కువ కావడంతో ఆమె తుదిశ్వాస విడిచారు.
కే విశ్వనాథ్ ఈనెల 2న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఒక పాట రాయాలని సంకల్పించిన విశ్వనాథ్ గారు దాన్ని పూర్తి చేసే క్రమంలో ఇబ్బంది పడ్డారు . కుమారుడిని పిలిచి పాట రాయాలని కోరాడు. కొడుకు పక్కన కూర్చొని పాటకు సాహిత్యం చెబుతూ ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అక్కడే తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన జయంతి సందర్భంగా సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. సౌత్ ఇండియా నటులు మొత్తం ఈ సంస్మరణ సభలో పాల్గొన్నారు.
కే విశ్వనాథ్ పార్థివదేహం సందర్శనకు వచ్చిన ప్రముఖులు జయలక్ష్మి గారిని పరామర్శించారు. కే విశ్వనాథ్ గారి మరణం మరవక ముందే ఆయన సతీమణి కన్నుమూయడం ఊహించని పరిణామం. ఆ ఆదిదంపతులకు ఒకరిపై మరొకరికి ఎంత ప్రేముందో కాని భర్త దూరమైన రోజుల వ్యవధిలో తనువు చాలించారు. జయలక్ష్మి మరణవార్త తెలిసిన చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఒకే నెలలో తల్లిదండ్రులను పిల్లలు కోల్పోయారు.