Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణ కు( Botsa Satyanarayana ) మంచి పేరు ఉంది రాజకీయాల్లో. అయితే ఆయన ఇటీవల వ్యవహరిస్తున్న తీరు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మంచి బలమైన నాయకుడిగా పేరు ఉన్న ఆయన నిన్ననే మీడియా ముందు ఏడ్చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం పై మంత్రి కింజరాపు అచ్చెనాయుడు నీచంగా మాట్లాడాలంటూ బొత్స భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అచ్చెనాయుడు తన ప్రెస్ మీట్ లో వైయస్ గురించి పెద్దగా మాట్లాడలేదు. బొత్సను కూడా ఏమీ అనలేదు. వైయస్ మరణం వెనుక జగన్ ఉన్నారని అనుమానాలు ఉన్నాయి అని నాడు బొత్స పేర్కొన్నారని మాత్రమే గుర్తు చేశారు. కానీ వైయస్ మరణం పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలు పెట్టింది. బొత్స భావోద్వేగానికి గురై కన్నీటి పర్యాంతమయ్యారని తన అనుకూల మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది.
* అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు..
వాస్తవానికి బొత్స జగన్మోహన్ రెడ్డి తో పాటు రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు ఎక్కువగా చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో, 2014 ఎన్నికల్లో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి కూడా ఆశించారు. కానీ స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి దక్కేసరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బొత్సకు అవకాశం ఇచ్చింది హై కమాండ్. 2017 జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర వరకు బొత్స ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చింది. కానీ కాంగ్రెస్ బలోపేతం కాకపోవడంతో బొత్స కుటుంబమంతా అనివార్య పరిస్థితుల్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది.
* నాటి బొత్స మాటలు ఇవే
అయితే పీసీసీ అధ్యక్ష పదవి హోదాలో 2012 జూన్ 2న బొత్స కీలక కామెంట్స్ చేశారు.’ పదవి కాంక్షతో వైయస్ విజయలక్ష్మి, జగన్ కొనసాగిస్తున్న విధానాలను చూస్తుంటే వైయస్సార్ మృతి పై మరిన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. రచ్చబండ కు వెళ్లొద్దని చెప్పినప్పటికీ వినకుండా వెళ్లి వైయస్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని నాడు ప్రకటించిన విజయలక్ష్మి.. ఇప్పుడు తన భర్త మరణం పై సందేహాలు ఉన్నాయ అనడం ఎంతవరకు సమంజసం.. మాజీ ఐఆర్ఎస్ అధికారి బ్రహ్మానంద రెడ్డికి, జగన్ కు మధ్య ఉన్న సత్సంబంధాలే… వైయస్ మృతి వెనుక జగన్ ఉన్నాడన్న అనుమానాలకు బలపరుస్తున్నాయి. వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన గాలి జనార్దన్ రెడ్డి కోట్లు కుమ్మరించి సిబిఐ జడ్జిని వశపరచుకోగా.. జగన్ కోట్ల రూపాయల ప్రలోభం చూపి ఎమ్మెల్యేలను బేరమాడుతున్నారు’ అంటూ బొత్స నాడు వ్యాఖ్యానించారు.
* గుర్తుచేస్తూ వ్యాఖ్యలు..
అయితే అదే విషయాన్ని మంత్రి కింజరాపు అచ్చెనాయుడు గుర్తు చేస్తూ మాట్లాడారు. అది కూడా చిన్న వ్యాఖ్య చేశారు. నాడు వైయస్ మృతి పై బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేసిన విషయాన్ని బయటపెట్టారు. అయితే బొత్స తాను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించలేదని.. ఆ కుటుంబం పై అనుమానం వ్యక్తం చేయలేదని.. తప్పుడు ఆరోపణలు చేశారంటూ భావోద్వేగానికి గురై వెక్కివెక్కి ఏడవడం మాత్రం ఆసక్తి రేపుతోంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు బొత్స. ఆ విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను అడిగినా చెబుతారు. కానీ ఇప్పుడు తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఏడ్చుతూ చెప్పడం మాత్రం కాస్త అతి అనిపిస్తోంది.