https://oktelugu.com/

YS Jagan – KCR : జగన్ కష్టంలో పాలుపంచుకోని కేసీఆర్.. జగన్ కు హ్యాండ్ ఇచ్చినట్టేనా?

తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఐదేళ్ల పాటు జగన్, కెసిఆర్ తెలుగు రాష్ట్రాల సీఎంలు గా ఉన్నారు. రాజకీయంగా ఇచ్చిపుచ్చుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడలేదన్న విమర్శ ఉంది.అయితే ఇప్పుడు ఇద్దరూ అధికారానికి దూరమయ్యారు. కానీ రాజకీయంగా సహకరించుకోకపోవడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : July 24, 2024 1:23 pm
    Follow us on

    YS Jagan – KCR : తెలుగు రాష్ట్రాల్లో రెండు రాజకీయ పార్టీలు అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. తెలంగాణలో ఓటమితో కెసిఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు పడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. అప్పటి నుంచి పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. మరోవైపు కేసులు వేధిస్తున్నాయి. ఏపీలో జగన్ పరిస్థితి అదే తీరుతో ఉంది. 175 స్థానాలకు గాను ఆ పార్టీ 11 సీట్లకే పరిమితం అయ్యింది. దీంతో ఈ ఇద్దరు మిత్రులు రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఒకరికొకరు బాహటంగా మద్దతుగా నిలవకపోవడం విశేషం.

    * తెలంగాణ నుంచి పక్కకు తప్పుకున్న వైసిపి
    2014లో రాష్ట్ర విభజన జరిగింది. అప్పటికే తెలుగుదేశం, టిఆర్ఎస్, వైసిపి వంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో తెలంగాణలో సైతం టిడిపి, వైసిపి పోటీ చేశాయి. టిడిపి కీలక స్థానాలను దక్కించుకుంది. వైసీపీ సైతం ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకుంది. అయితే కెసిఆర్ తో స్నేహం మూలంగా.. తెలంగాణలో వైసీపీని రద్దు చేశారు జగన్. కెసిఆర్ నాయకత్వానికి జై కొట్టారు. కానీ చంద్రబాబు మాత్రం 2018 ఎన్నికల్లో సైతం పోటీ చేశారు. కాంగ్రెస్ తో జత కట్టారు. తనను అధికారం నుంచి దూరం చేసేందుకు కాంగ్రెస్తో చంద్రబాబు చేతులు కలపడాన్ని కెసిఆర్ సహించలేకపోయారు. అందుకే రిటర్న్ గిఫ్ట్ అంటూ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి సహకరించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ తో స్నేహాన్ని కొనసాగించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎంత దెబ్బతీయాలో.. అంతలా చేశారు.

    * ఇద్దరికీ ఇబ్బందులే
    గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అప్పటినుంచి కెసిఆర్ కు కష్టాలు ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా బిఆర్ఎస్ కు దక్కలేదు. దీంతో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఇటువంటి తరుణంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గతంలో అధికారంలో ఉండడంతో జగన్, కెసిఆర్ లు పరస్పర రాజకీయ సహకారం ఇచ్చిపుచ్చుకునేవారు. ఇప్పుడు ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నారు. పార్టీ నడపడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు సహకరించుకుంటే.. ప్రజల్లోకి ఎటువంటి సంకేతం వెళ్తుందోనని భయపడుతున్నారు.

    * ధర్నాకు మద్దతు ఉందా
    ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయంటూ జగన్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా ఈరోజు ధర్నా చేపడుతున్నారు జగన్. ఈ ఆందోళనకు మద్దతు తెలపాలని అన్ని పార్టీలను కోరింది వైసిపి. ముందుగా వామపక్షాలను కోరితే వారు మద్దతు ప్రకటించలేదు. దీంతో ఏకవాక్యంతో అన్ని పార్టీల మద్దతు కోరింది వైసిపి. కానీ ఏ పార్టీ నుంచి వైసీపీ చేపడుతున్న ధర్నాకు మద్దతు లభించలేదు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుంది అన్నది అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరడంతో బిఆర్ఎస్ నూ కోరారో లేదో క్లారిటీ లేదు. అయితే తప్పకుండా బిఆర్ఎస్ నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కొన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ ధర్నాకు దూరంగా ఉంటుందన్న వాదన కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.