Bode Ramachandra Yadav: ఏపీలో ( Andhra Pradesh)ప్రతిపక్ష పార్టీ లేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి హాజరు కావడం లేదు జగన్మోహన్ రెడ్డి. వారంలో నాలుగు రోజులు పాటు బెంగళూరులో.. మూడు రోజులపాటు తాడేపల్లి కి వచ్చి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మధ్య మధ్యలో కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు భరోసా ఇచ్చేవారు కరువయ్యారు. మొన్న తుఫాన్ వెళ్లిపోయిన వారం రోజుల తర్వాత బాధితులను పరామర్శించడం విమర్శలకు గురిచేసింది. జగన్మోహన్ రెడ్డి తీరు ఇలా ఉంటే మిగతా రాజకీయ పక్షాల పనితీరు కూడా అలానే ఉంది. రాజకీయ విమర్శలు చేయడంలో దూకుడు ప్రదర్శించే కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల.. ఇప్పుడు మాత్రం కనిపించకుండా మానేశారు. ప్రజలు సమస్యల్లో ఉంటే కనీసం పరామర్శించిన దాఖలాలు లేవు. వామపక్షాల ది అదే పరిస్థితి. ఇటువంటి తరుణంలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధపడుతున్నారు బోడె రామచంద్ర యాదవ్. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు. ఏపీ ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు ఆయన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
* ప్రజలకు దగ్గర కావాలని..
బోడె రామచంద్ర యాదవ్ ( Bode Ramachandra Yadav)ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సుపరిచితమైన పేరు. అయితే కోస్తాతో పాటు రాయలసీమలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ గోదావరి తో పాటు ఉత్తరాంధ్రలో సైతం తన పేరు మార్మోగేలా చూడాలని చూస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాలను అంచనా వేసుకుని అడుగులు వేస్తున్నారు. 2024 ఎన్నికల కు ముందు గ్రాండ్ గా తన పార్టీని ప్రారంభించారు. కేవలం తన సొంత నియోజకవర్గ పుంగనూరులో పట్టు కోసం తపించిన ఆయన బీసీ నినాదంతో బీసీవై పార్టీని ఏర్పాటు చేశారు. ముందుగా అదో పార్టీ ఉందని గుర్తించుకునేలా చేశారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి తనను గుర్తించాలని కోరనున్నారు.
* త్వరలో పాదయాత్ర..
కాశీ బుగ్గ ( Kashi Bugga )తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధితులను ఇటీవల రామచంద్ర యాదవ్ పరామర్శించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా భవిష్యత్తు రాజకీయాలు చేసేందుకు రామచంద్ర యాదవ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. తద్వారా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా బీసీవై పార్టీని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీలో కూటమికి ధీటుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడక పోవడానికి కూడా గుర్తించారు. అందుకే జగన్ కంటే ప్రజల్లోకి ముందుగా వెళ్లి వారికి దగ్గర ఏ ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.