Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: నాడు తోడల్లుడు.. నేడు వదిన.. చంద్రబాబు సీఎం ప్రతిపాదన కథ

Chandrababu: నాడు తోడల్లుడు.. నేడు వదిన.. చంద్రబాబు సీఎం ప్రతిపాదన కథ

Chandrababu: తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో రకాల సంక్షోభాలను ఎదుర్కొంది. పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చింది. అదే స్థాయిలో సంక్షోభానికి ఎదురు కావడం ఎంతో సమయం పట్టలేదు. 1985లో నాదేండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబాటు ఎదురయింది. కానీ ప్రజా ఉద్యమంగా మలిచి.. ఆ ఎన్నికల్లో సూపర్ విక్టరీని అందుకున్నారు ఎన్టీఆర్. కానీ 1995లో ఎదురైన సంక్షోభాన్ని మాత్రం అధిగమించలేకపోయారు. అయితే పార్టీ, ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్న చంద్రబాబు మాత్రం సక్సెస్ ఫుల్ గా తీసుకెళ్లడంలో.. అంతే సక్సెస్ అయ్యారు. తెలుగుదేశం పార్టీని ఆరోసారి అధికారంలోకి తీసుకొచ్చారు.

మరికొద్ది గంటల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ కూటమి నేతగా నిన్ననే ఆయనను ఎన్నుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రతిపాదించారు. కూటమినేతగా మిగతా పార్టీలు బలపరిచాయి. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు 1995 ఎపిసోడ్ ను గుర్తు చేసుకున్నారు. నాడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. పార్టీని చంద్రబాబు హస్తగతం చేసుకున్నారు. అయితే నాడు చంద్రబాబు సీఎంగా ప్రతిపాదించింది తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. సరిగ్గా 29 సంవత్సరాల తరువాత దగ్గుబాటి పురందేశ్వరి కూటమి నేతగా చంద్రబాబును ప్రతిపాదించారు. సీఎం అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే నాడు తోడల్లుడు, నేడు వదిన చంద్రబాబు నాయకత్వాన్ని ప్రతిపాదించారని టిడిపి నేతలు గుర్తు చేసుకున్నారు.

ఏపీలో తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు వెనుక పురందేశ్వరి కృషి ఉంది. చంద్రబాబును చెక్ చెప్పేందుకే పురందేశ్వరి కి రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పదవి ఇచ్చారని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా పురందేశ్వరి చంద్రబాబు పట్ల ఉదారంగా వ్యవహరించారు. ఎన్నడూ ఒక్క విమర్శ కూడా చేయలేదు. 1995లో చంద్రబాబు సీఎం కావడానికి పురందేశ్వరి దంపతులు ఎంతగానో కృషి చేశారు. కానీ చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత తొక్కి పెట్టారన్న విమర్శ ఉంది. అందుకే వారు టిడిపికి దూరమయ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. సుదీర్ఘకాలం కేంద్రమంత్రిగా పురందేశ్వరి పదవి చేపట్టారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నా ఆయనతో సంబంధాలు అంతంత మాత్రమే. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. రెండు కుటుంబాల మధ్య సన్నిహితం పెరిగింది. ఇప్పుడు రాజకీయంగా కూడా పరస్పరం సహకారం అందించుకునే స్థితిలోకి వచ్చారు. ఈసారి ఏపీలో కూటమి కట్టడం, అధికారంలోకి రావడం జరిగిపోయింది. కూటమినేతగా, సీఎంగా పురందేశ్వరి ప్రతిపాదించారు. దానికి బదులుగా లోక్సభ స్పీకర్ సీట్లో పురందేశ్వరిని కూర్చోబెట్టేందుకు చంద్రబాబు తనవంతు కృషి చేస్తారని టిడిపి నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version