Chandrababu: ఆ ఇద్దరికి చంద్రబాబు ఛాన్స్

ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేత. రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు. 2004లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు తన క్యాబినెట్ లోకి ఆనం రామనారాయణ రెడ్డిని తీసుకున్నారు.

Written By: Dharma, Updated On : June 12, 2024 11:19 am

Chandrababu

Follow us on

Chandrababu: రాష్ట్ర మంత్రివర్గంలో సామాజిక సమతూకాన్ని పాటించారు. అన్ని వర్గాలకు పెద్దపీట వేశారు. అన్నింటికీ మించి వైసీపీలో దగాకు గురైన ఇద్దరు నాయకులకు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి లకు అవకాశం ఇచ్చారు. ఆది నుంచి టిడిపిలో కొనసాగిన సీనియర్లను కాదని వారికి ఇవ్వడం సాహసమే. వారికిఇచ్చిన మాటకు కట్టుబడి చంద్రబాబు పదవులు కేటాయించారు.ఒక్కమాటలో చెప్పాలంటే అది సాహస నిర్ణయమే.

ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్ నేత. రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు. 2004లో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు తన క్యాబినెట్ లోకి ఆనం రామనారాయణ రెడ్డిని తీసుకున్నారు. 2014 వరకు ఆయన అదే క్యాబినెట్లో కొనసాగుతూ వచ్చారు. 2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ పిలుపుమేరకు వైసీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఆనం రామనారాయణరెడ్డిని కాకుండా.. తొలుత అనిల్ కుమార్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చారు జగన్. విస్తరణలోనైనా చోటు దక్కుతుందని భావించారు ఆనం రామనారాయణ రెడ్డి. కానీ అప్పుడు కూడా షాక్ ఇచ్చారు. అనిల్ ను తప్పించి కాకాని గోవర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించారు. అప్పటినుంచి నెల్లూరు జిల్లాలో బాహటంగానే అసంతృప్తి వెలిబుచ్చారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆ జిల్లాలో అధికార పార్టీలో అసమ్మతి రాజేయడంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఈసారి చంద్రబాబు ఆనం రామనారాయణ రెడ్డి ని క్యాబినెట్ లోకి తీసుకున్నారు. గత ఐదుసార్లు ఓడిపోయి.. ఇప్పుడు ఆరోసారి గెలిచిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తప్పించి మరి.. ఆనం కు చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు.

కొలుసు పార్థసారథి సైతం సీనియర్ నేత. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందారు. సిన్సియారిటీ ఉన్న నాయకుడిగా గుర్తింపు సాధించుకున్నారు. అటువంటి నాయకుడిని పక్కన పెట్టారు జగన్. ఆయనను కాదని.. కృష్ణాజిల్లాలో తొలుత కొడాలి నానిని, తరువాత జోగి రమేష్ ను ప్రోత్సహించారు. మంత్రి పదవులు కేటాయించారు. చివరకు కొలుసు పార్థసారథి సొంత నియోజకవర్గం పెనమలూరులో టిక్కెట్ నిరాకరించారు. దీంతో చంద్రబాబు పిలుపుమేరకు టిడిపిలో చేరారు పార్థసారథి. చంద్రబాబు ఆయనకు నూజివీడు టికెట్ కేటాయించారు. గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కొలుసు పార్థసారధిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఆ ఇద్దరికీ మాత్రం ఆయాచిత అదృష్టం లభించినట్టే.