BJP And YCP: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ విషయంలో బిజెపి స్టాండ్ ఏంటి? ఆ పార్టీని రాజకీయ ప్రత్యర్థిగా చూస్తోందా? పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ జరుగుతోంది. తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై సంచలన ఆరోపణలు చేశారు. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలిందని చెప్పుకొచ్చారు. అభివృద్ధి లేకుండా పోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వంతో సత్వర అభివృద్ధి సాధ్యమని కూడా తేల్చి చెప్పారు. ఏకంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నోటి నుంచి ఆ మాట రావడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి మద్దతు ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇండియా కూటమికి కాదనుకొని బిజెపి అభ్యర్థికి అండగా నిలిచింది. అయినా సరే బిజెపి నుంచి ఆ స్థాయిలో విమర్శలు రావడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. ఇది రిటర్న్ గిఫ్ట్ గా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
* ఆ వ్యూహంతోనే బిజెపి..
ఏపీ విషయంలో భారతీయ జనతా పార్టీకి( Bhartiya Janata Party) ఒక వ్యూహం ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్న బిజెపి బలపడడం లేదు. బిజెపి బలపడే వరకు ఏపీలోని రాజకీయ పార్టీలను తన అదుపు ఆజ్ఞలు ఉంచుకోవడం బిజెపికి అలవాటైన విద్య. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏకు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిజెపి పరోక్ష సహకారం అందించేది అనేది బహిరంగ రహస్యమే. అయితే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరిక మేరకు తెలుగుదేశం పార్టీని భారతీయ జనతా పార్టీ తొక్కిపడేయ్యాలి. కానీ బిజెపి ఆ పని చేయలేదు. ఎందుకంటే ఏపీలో బిజెపి ఎదిగేందుకు అవసరమైన పరిస్థితిని క్రియేట్ చేయాలి. టిడిపిని నిర్వీర్యం చేయడం ద్వారా బిజెపికి వచ్చే రాజకీయ లబ్ధి లేదు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనేది బిజెపికి కలిసి వచ్చే అంశం కాదు. అందుకే తెలుగుదేశం పార్టీని చూసి చూడనట్టుగా విడిచి పెట్టింది బిజెపి.
* చంద్రబాబు ముందుచూపు..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తొక్కిపడేసే ఛాన్స్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది. వైసిపి నేతలను బిజెపిలోకి పంపించడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయవచ్చు. కానీ అది తిరిగి తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే దానిని ఎంత మాత్రం ఎంటర్టైన్ చేయలేదు. అదే సమయంలో బిజెపి సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. తమకు ఏపీలో పట్టు చిక్కే వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండాలి. తెలుగుదేశం పార్టీ మనుగడలో ఉండాలి. ఎప్పుడైతే బిజెపి ఒంటరిగా పోటీ చేసినా.. నిలబడుతుంది అని నమ్మకం వచ్చిన మరుక్షణం ఏపీలో బిజెపి విశ్వరూపం చూడడం తథ్యం. అయితే ఏపీలో ఉన్నది చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని కేంద్ర పెద్దలు గుర్తించుకోవాలి. వారి నుంచి ఏపీ లాక్కోవడం అంత సులువు కాదు. ఆపై భారతీయ జనతా పార్టీ నాలుగున్నర దశాబ్దాలుగా ఏపీలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ మరొకరి సహాయం లేకుండా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అందుకే రిటర్న్ గిఫ్ట్ అనేది ఉండదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బిజెపి దెబ్బ తీయలేదు. అందుకు చంద్రబాబు కూడా సహకరించే పరిస్థితి ఉండదు.