YCP: వైసిపి అధినేత జగన్( Y S Jagan Mohan Reddy) ఒక నిర్ణయానికి వచ్చారా? పార్టీలో భారీ ప్రక్షాళన చేయనున్నారా? పనిచేయని వారిని పక్కన పెట్టనున్నారా? ఎటువంటి మొహమాటాలకు పోదలుచుకోలేదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక సర్వే చేస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా చేస్తున్న ఈ సర్వేలో.. అసలు పార్టీలో యాక్టివ్ గా ఉన్న వారు ఎవరు? లేనివారు ఎవరు? వారి ప్రభావం ఎంత ఉంటుంది? వారి స్థానంలో కొత్త నేతకు చాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? అనే దానిపై ఒక సమగ్ర సర్వే చేసినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఒక వందమంది నేతలు పార్టీలో యాక్టివ్ గా లేనట్లు స్పష్టమవుతోంది. అయితే వారిని పక్కన పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
* సీనియర్ల మౌనం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి నేతల కరువు లేదు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది నేతలు యాక్టివ్ కావడం లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కీలక నేతలు చాలామంది ఇంకా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. పార్టీ కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినా ఏదో నామమాత్రంగానే హాజరవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన ఇంతవరకు పార్టీ కార్యక్రమాల ముఖం చూడడం లేదు. కొందరైతే నియోజకవర్గాల్లో అందుబాటులోకి లేకుండా.. సాక్షి మీడియాలో ప్రకటనలకు పరిమితం అవుతున్నారు. పార్టీలో కూడా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. కనీసం పెద్ద స్థాయి నేతలు ఎవరు జిల్లాలను టచ్ చేయడం లేదు. ఇలా అయితే కష్టమే నన్న మాట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తోంది.
* ఆందోళనలు విఫలం
ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది అన్నది ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయం. కానీ ఆ పార్టీ హైకమాండ్ ఇచ్చిన ఆందోళన కార్యక్రమాలు ఏవి ప్రజల్లోకి బలంగా వెళ్లలేదు. ఇటీవల మెడికల్ కాలేజీ ల( medical colleges) వద్దకు వెళ్లి..అక్కడ ఫోటోలు తీసి.. మీడియా మీట్లు నిర్వహించాలని అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అయితే కొన్నిచోట్ల మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదు. మరి కొన్నిచోట్ల పునాదుల స్థాయిలోనే ఉంది. అక్కడకు వెళ్లి మీడియా మీట్లు నిర్వహించడానికి నేతలు ముఖం చాటేశారు. దీనిపై జగన్ కూడా ఆశ్చర్యపోయారు. స్వయంగా తాను ఆదేశించినా పెద్దగా ఫలితం లేకపోవడంపై పునరాలోచనలో పడ్డారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఏ నేత యాక్టివ్ గా ఉన్నారు? ఎవరు లేరు? అనే దానిపై ఒక సర్వే చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక వంద మంది నాయకులు అంత క్రియాశీలకంగా లేరని ఈ సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తీసుకున్నాక దిద్దుబాటు చర్యలకు దిగే అవకాశం ఉంది.
* చివరిగా ఒక అవకాశం..
ఇలా గుర్తించిన వందమంది నాయకుల పనితీరు, వారి ప్రభావం ఎలా ఉంటుంది? నాయకత్వం మార్చితే ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అన్నదానిపై జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వంద మంది నాయకులు యాక్టివ్ కావాల్సిందేనని నాయకత్వం నుంచి ఆదేశాలు వెళ్లే అవకాశం ఉంది. అక్కడకు వారు మారకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు దిగడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.