Pawan Kalyan- BJP: దేశంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. కానీ ఏపీలో మాత్రం బలోపేతం కాలేకపోతోంది. దానికి సవాలక్ష కారణాలున్నాయి. అయితే ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ వారికి అనుకోని వరంగా కనిపించారు. చంద్రబాబు బీజేపీతో విభేదించడం, గత ఎన్నికల్లో ఓటమి తరువాత పవనే బీజేపీకి ఆశాదీపంగా మారిపోయారు. పవన్ కు ఉన్న మాస్ ఇమేజ్ తో టీడీపీకి ప్రత్యమ్నామయంగా బీజేపీ, జనసేన కూటమిని తీర్చదిద్దాలని హైకమాండ్ పెద్దలు తలపోశారు. ఇరు పార్టీలు కలిసే వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటే క్రమంలో రెండు పార్టీలు చెరో అజెండాతో విడిపోయాయి. దీంతో ఆదిలో ఉన్న సఖ్యత ఇప్పుడు రెండు పార్టీల మధ్య కొరవడింది. సర్థిచెప్పుకోలేనంత ఎడబాటు ఎదురైంది. టీడీపీని కలుపుకొని వెళ్లాలన్న జనసేనాని నిర్ణయాన్నిబీజేపీ తప్పుపడుతుండగా.. ఏపీలో ప్రజా విరుద్ధపాలన చేస్తున్న జగన్ కు సాయమందిస్తున్న బీజేపీ వైఖరిని పవన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ దరిమిలా తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య అగాధాన్ని మరింత పెంచాయి.

అటు విభజన హామీల విషయంలో కేంద్ర పెద్దల వైఖరి, ఏపీలో జగన్ సర్కారు చేస్తున్న నిర్వాకాలను కట్టడి చేయకపోవడం తదితర పరిణామాలతో పవన్ కలత చెందారు. అటు ఏపీ ప్రభుత్వ చర్యలతో జనసేనకు వ్యక్తిగతంగా నష్టం జరుగుతోంది. అటు రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా, ఇటు వ్యక్తిగతంగా నష్టం జరుగుతున్నా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పట్టించుకోకపోవడంపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటుగానే కామెంట్స్ చేశారు. దీంతో బీజేపీ హైకమాండ్ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజును ఢిల్లీకి రప్పించింది. ఏపీలో జరుగుతున్న పరిస్థితులను ఆరాతీసే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పుడు ఏపీలో బీజేపీకి ఉన్న ఎకైక ఆప్షన్ జనసేనే. గడిచిన ఎనిమిది సంవత్సారాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్నా ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం తన ఉనికి చాటుకోలేకపోతోంది. తొలి నాలుగేళ్లు టీడీపీతో ట్రావెల్ చేసినా.. తాజాగా నాలుగేళ్లు వైసీపీకి పరోక్ష సహకారం అందించినా ఏపీలో ఆ పార్టీ పరిస్థితి ఏమంత పురోగతి లేదు. పక్కన ఉన్న తెలంగాణతో పోల్చుకుంటే ఓట్లు, సీట్లు పరంగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అదే పవన్ తో ఒప్పందం మేరకు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసి పోరాటం చేసి ఉన్నా.. పవన్ కు రూట్ మ్యాపు ఇచ్చి ప్రోత్సహించి ఉన్నా ఇంతోకొంత ఆ పార్టీకి మైలేజ్ వచ్చి ఉండేది. రేపు పొద్దున ఏదో పార్టీతో అలయెన్స్ కట్టినా సీట్లు, ఓట్ల సంఖ్య పెంచుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి అవకాశాన్ని జనసేనను విడిచిపెట్టుకోవడం ద్వారా బీజేపీ జార విడుచుకుంది.

అయితే ఇప్పటికీ బాల్ ను పవన్ బీజేపీ కోర్టులోనే ఉంచారు. ఏపీ ప్రయోజనాల విషయంలో బీజేపీ ముందుకొస్తే పునరాలోచిస్తామని కూడా ప్రకటించారు. పవన్ ప్రెస్ మీట్ ఢిల్లీ సర్కిల్ లో సర్క్యులేట్ అయ్యింది. దీంతో జరిగిన నష్టాన్ని గుర్తించిన హైకమాండ్ పెద్దలు దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. చర్చల కోసమని పవన్ ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. మంచిరోజు చూసుకొని వస్తే అన్ని విషయాలను చర్చించుకుందామని నడ్డా నుంచి జనసేనానికి పిలుపు అందింది. మరోవైపు ప్రతీ నెల జగన్ కేంద్ర పెద్దలను కలుస్తుంటారని తెలిసిందే. అయితే ఒకసారి కలుస్తానని కబురుపెట్టిన జగన్ కు కేంద్ర పెద్దలు ఝలక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అపాయింట్మెంట్ కుదరదని తేల్చిచెప్పడంతో జగన్ డిఫెన్స్ లో పడిపోయారు. తనను కెలికితే రాజకీయాలను షేక్ చేయిస్తానని చెప్పిన పవన్ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నిజంగానే షేక్ చేయించారన్న మాట.