Vishnu Kumar Raju dissatisfaction: బిజెపి సీనియర్ నేత విష్ణు కుమార్ రాజు( Vishnu Kumar Raju) అసంతృప్తితో ఉన్నారా? పార్టీలో తన మాట చెల్లుబాటు కావడం లేదని బాధపడుతున్నారా? ప్రభుత్వంలో సైతం తనకు ప్రాధాన్యం లేదని భావిస్తున్నారా? తరచు ఆయన ఇదే ఆవేదనతో గడుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచారు విష్ణుకుమార్ రాజు. అయితే ఆయన మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ దక్కలేదు. పోనీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగానైనా అవకాశం ఇస్తారని చూశారు. అది కూడా జరగలేదు. చివరికి బిజెపి శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. అయితే సభలో మాట్లాడినప్పుడు ఆయన ప్రభుత్వానికి విలువైన సూచనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోయేసరికి ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో పొత్తులో భాగంగా గెలిచారు విష్ణుకుమార్ రాజు. ఇప్పుడు కూడా పొత్తులో భాగంగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి కావాలన్నది ఆయన కల. కానీ అది తీరడం లేదు.
చంద్రబాబు పట్ల విధేయత..
2018లో ఎన్డీఏకు ( National democratic Alliance )గుడ్ బై చెప్పింది తెలుగుదేశం పార్టీ. ఏపీలో టిడిపి ప్రభుత్వం నుంచి తప్పుకుంది బిజెపి. ఆ సమయంలో ఆయన బిజెపి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవైపు బిజెపి సభ్యుడిగా కొనసాగుతూనే చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉండేవారు విష్ణుకుమార్ రాజు. జాతీయస్థాయిలో బిజెపిని అప్పట్లో వ్యతిరేకించారు చంద్రబాబు. కానీ చంద్రబాబు విషయంలో సానుకూలంగా ఉండేవారు విష్ణుకుమార్ రాజు. చివరికి ఐదేళ్ల వైసిపి పాలనలో సైతం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడే ఒకే ఒక్క నాయకుడు బిజెపి నుంచి విష్ణు కుమార్ రాజు. అదే సమయంలో చంద్రబాబు పాలనను మెచ్చుకోవడమే కాదు ఆయనపై గౌరవభావంతో చూసేవారు. మొన్నటి ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజుకు సీటు సర్దుబాటు చేసేందుకు చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల్లో గెలిచేసరికి విష్ణుకుమార్ రాజుకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం నడిచింది. కానీ అది అందని ద్రాక్షగా మిగిలింది.
రుషికొండ భవనాల విషయంలో
విశాఖ ( Vishakha ) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు విష్ణు కుమార్ రాజు. ఆపై బిజెపి శాసనసభాపక్ష నేతగా కూడా ఉన్నారు. కానీ ఎందుకో విశాఖ నగరంలో జరుగుతున్న కొన్ని రకాల పరిణామాల విషయంలో విష్ణుకుమార్ రాజు అసంతృప్తితో ఉన్నారు. భాగస్వామ్య పక్షంగా ఉన్న… శాసనసభ పక్ష నేతగా ఉన్న తన అభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదన్న ఆవేదన ఆయనలో ఉంది. ప్రధానంగా రుషికొండ భవనాల విషయంలో కీలక సూచనలు చేశారు విష్ణుకుమార్ రాజు. వైసిపి హయాంలో నిర్మించిన ఈ భవనాలను ఎలా వినియోగించుకుంటాం అన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అయితే అది ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకుండా.. ప్రభుత్వమే మ్యూజియం గాను, విలువైన పర్యాటక ప్రాంతంగాను తీర్చిదిద్దాలని విష్ణుకుమార్ రాజు సూచిస్తున్నారు. దానికి ఆయన చూపుతున్న కారణం వైసిపి వైఫల్యాలు సజీవంగా చూపాలన్నదే. కానీ విష్ణుకుమార్ రాజు అభిప్రాయాన్ని గౌరవించే పరిస్థితి కనిపించడం లేదు. ఆపై సొంత పార్టీలో సైతం ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. అందుకే రాజకీయాల పట్ల ఆయన విరక్తి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తాను తప్పుకోవాలని ఒక స్ట్రాంగ్ డెసిషన్కు వచ్చినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.