Pawan Kalyan
Pawan Kalyan: బిజెపితో టిడిపి ని కలిపేందుకు పవన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నో రకాలుగా ఒత్తిడి చేసి బిజెపిని ఏపీలో కూటమిలోకి తేగలిగారు. తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ గూటికి చేర్చగలిగారు. సీట్ల కేటాయింపును సైతం ఒక కొలిక్కి తెచ్చారు. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి అన్నదానిపై సైతం పవన్ డిసైడ్ చేయనున్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల నుంచి వస్తున్న ఆదేశాలు.. ఇలా అన్నింటిలో పవన్ కీలకంగా వ్యవహరిస్తుండడం విశేషం.
పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, మూడు పార్లమెంట్ స్థానాలను టిడిపి కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుగురు అసెంబ్లీ అభ్యర్థులను పవన్ ప్రకటించారు. ఇంకా 19 మందిని పెండింగ్లో ఉంచారు. అనకాపల్లి, మచిలీపట్నం, కాకినాడ పార్లమెంటు స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు దక్కనున్నాయి. అయితే బిజెపి నుంచి వచ్చిన విన్నపం మేరకు పార్లమెంట్ స్థానాన్ని వదులుకున్నారు. అనకాపల్లి ని బిజెపికి విడిచిపెట్టారు. జనసేన కేవలం రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు సమ్మతించారు. అయితే బిజెపి నుంచి జనసేనకు వినతులు వస్తూనే ఉన్నాయి. పవన్ ఎంపీగా పోటీ చేయమని కేంద్ర పెద్దలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో 2 శాసనసభ స్థానాలను తమకు విడిచి పెట్టాలని పవన్ కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం బిజెపి జాతీయ బృందం విజయవాడలో ఉంది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో పాటు ఒడిస్సా ఎంపీ బై జయంతి పండా విజయవాడలో మకాం వేశారు. హైదరాబాదు నుంచి విజయవాడ చేరుకున్న పవన్ వారిని కలిశారు. కీలక చర్చలు జరిపారు. అయితే వారు తాజా ప్రతిపాదనలను పవన్ కు చేసినట్లు తెలుస్తోంది.రెండు అసెంబ్లీ సీట్లు బిజెపికి విడిచి పెట్టాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. దానిపైనే సీరియస్ గా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు పవన్ ఎంపీగా పోటీ చేస్తే.. ముఖ్యమంత్రి పదవితో సమానమైన కేంద్ర మంత్రి పదవి ఇస్తామని బిజెపి నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. కానీ పవన్ మాత్రం ఇప్పటివరకు ఎంపీగా పోటీ చేయడం అన్నదానిపై ఆలోచన చేయలేదని సమాచారం. ఈరోజు సాయంత్రానికి బిజెపి బృందంతో చర్చలు ఒక కొలిక్కి వస్తాయని తెలుస్తోంది.
వాస్తవానికి ఈపాటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెల్లడించాలి.2019 ఎన్నికల్లో సైతం మార్చి 10 నాటికి షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పుడు ఆ సమయానికి ఒకరోజు గడిచిపోయింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో ఈసీ బిజీగా ఉంది. అక్కడ ఏర్పాట్లు పూర్తయిన మరుక్షణం షెడ్యూల్ వెల్లడించే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకటనకు ముందే టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థులను ఉమ్మడిగా ప్రకటించే ఛాన్స్ ఉంది.