BJP – Andhrapradesh : ఏపీలో మూడు ఎంపీ సీట్లకు బీజేపీ ఫిక్స్..

దీనికి  పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. విజయవాడలో కూడాఇలాంటి సభే నిర్వహించనున్నారు. అయితే.. డేట్ ఫిక్స్ కాలేదు.మొత్తానికైతే బీజేపీ మూడు ఎంపీ స్థానాలను ఫిక్స్ చేసుకుందన్న మాట.

Written By: Dharma, Updated On : June 3, 2023 9:28 am
Follow us on

BJP – Andhrapradesh : ఏపీలో బోణీ కొట్టాలని బీజేపీ గట్టి ప్రయత్నమే చేస్తోంది.2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని చెబుతూ వచ్చిన కాషాయ దళం అటువంటి ప్రయత్నమేదీ చేయలేదు. కానీ ఇప్పుడు మూడు ఎంపీ సీట్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇందుకు ఢిల్లీ పెద్దలు ప్రత్యేకంగా వ్యూహాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. పొత్తుల ద్వారానైనా.. ఒంటరిగానైనా ఆ మూడు చోట్ల పట్టు నిలుపుకోవాలని చూస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అప్పుడెప్పుడో జన్ సంఘ్ నుంచి బీజేపీగా అవతరించుకున్న క్రమంలోనే ఏపీలో పట్టు సాధించింది ఆ పార్టీ. విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీవీ సుబ్బారావు విజయం సాధించారు. నాడు బీజేపీ అధ్యక్షుడిగా వాజ్ పేయ్ విశాఖలో రోజులతరబడి ఉండి పార్టీకి విజయాన్ని అందించారు. అటు తరువాత విశాఖ ఎంపీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే స్థానంపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇక్కడ నుంచి బీజేపీ క్యాండిడేట్ గా జీవీఎల్ నరసింహం దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 8న అమిత్ షా సాగరనగరానికి చేరుకోనున్నారు. పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేయనున్నారు.

విజయవాడ లోక్ సభ సీటుపై బీజేపీ హైకమాండ్ దృష్టిపెట్టింది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టీడీపీయే గెలుపొందుతూ వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని కూడా తట్టుకొని కేశినేని నాని ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి పార్టీలో ఏమంత బాగాలేదు.జిల్లా నాయకులతో పాటు పార్టీ హైకమాండ్ తో సైతం పొసగడం లేదు. దీంతో టీడీపీ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సీటుపై బీజేపీ ఫోకస్ చేయడం చర్చనీయాంశమైంది. గతంలో లోక్ సభ పరిధిలోని తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా సినీనటుడు కోటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఇక్కడ నాయకులతో పాటు కేడర్ ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో కంటెస్ట్ చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

పై రెండింటితో పాటు తిరుపతి పార్లమెంటు స్థానాల్లో విజయం దక్కించుకునేలా బీజేపీ పెద్దలు బిగ్ ప్లాన్ ఏదో రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది.ఇప్పటి నుంచే బీజేపీ అనుకూల ప్రచారానికి తెర తీయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8న విశాఖలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. కేంద్రంలో అధికారం చేపట్టి 9 సంవత్సరాలు పూర్తియన నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి కేంద్రమంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా రానున్నారు.10న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనికి  పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. విజయవాడలో కూడాఇలాంటి సభే నిర్వహించనున్నారు. అయితే.. డేట్ ఫిక్స్ కాలేదు.మొత్తానికైతే బీజేపీ మూడు ఎంపీ స్థానాలను ఫిక్స్ చేసుకుందన్న మాట.