AP BJP: శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఎవరికీ అంతు పట్టవు. అధికార ప్రతిపక్ష పార్టీల్లో విభేదాలు ఉన్నాయి. అధికార పార్టీలో కోల్డ్ వార్ సాగుతుండగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రత్యక్షంగానే విభేదాలు ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓటమితో ఇప్పుడు బయట పడుతున్నాయి. ఆమదాలవలస లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇన్చార్జి బాధ్యతలనుంచి తప్పించారు. ఆయన స్థానంలో ద్వితీయ శ్రేణి నాయకుడు చింతాడ రవికుమార్ కు బాధ్యతలు కట్టబెట్టారు. కుటుంబ వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాసును పార్టీ నుంచి సస్పెన్షన్ చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయలక్ష్మిని త్వరలో తప్పిస్తారని ప్రచారం నడుస్తోంది. అయితే వైసీపీ నుంచి నిరాదరణకు గురైన నేతలు ఇప్పుడు వేరే పార్టీలో చేరలేకపోతున్నారు. ఎందుకంటే కూటమి పార్టీల నుంచి వారికి ఆహ్వానం లేదు.
* మాజీ స్పీకర్ తమ్మినేని..
వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారాంకు టికెట్ దక్కదన్న సంకేతాలు వస్తున్నాయి. దీంతో ఆయన పునరాలోచనలో పడ్డారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు సీతారాం. కానీ ప్రజారాజ్యం పార్టీలో చేరి తర్వాత టిడిపిలోకి వచ్చారు. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గత మూడుసార్లు పోటీ చేసి ఒకసారి మాత్రమే గెలిచారు. అందుకే జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ ఉంది. అయితే ఆయన టిడిపిలోకి వచ్చే ఛాన్స్ లేదు. జనసేన లోకి వెళ్లే ప్రయత్నం చేసిన వర్కౌట్ కాలేదు. అయితే ఇప్పుడు బిజెపిలోకి వెళ్తారన్న ప్రచారం పతాక స్థాయిలో ఉంది.
* దువ్వాడ శ్రీనివాస్
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) చాలామందికి అవకాశాలు ఇచ్చారు. అలా అవకాశాలు కల్పించిన నేతల్లో దువ్వాడ శ్రీనివాసు ఒకరు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన వెంటనే ఆయన వెంట అడుగులు వేశారు. అందుకే దువ్వాడ శ్రీనివాస్ కు ఒకసారి ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. మూడుసార్లు ఆయన ఓడిపోయారు. అయితే ఎమ్మెల్సీ ని చేసి చట్టసభలకు పంపించారు జగన్. అయితే ఇప్పుడు వ్యక్తిగత కుటుంబ వివాదాలతో పార్టీ వేటు వేసింది. తిరిగి ఆయన చేరిక కష్టమేనని తేలిపోయింది. దీంతో ఆయన సైతం బిజెపిలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే టిడిపి తో పాటు జనసేనలో ఆయనకు అవకాశం లేనట్టే.
* జడ్పీ చైర్ పర్సన్ సైతం
ఇచ్చాపురం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయలక్ష్మి( Priya Vijayalakshmi) ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆమె భర్త పిరియా సాయిరాజ్ పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయితే మరోసారి ఆమెకు చాన్స్ లేదని తెలుస్తోంది. త్వరలో ఇచ్చాపురం నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్త వస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పిరియా విజయలక్ష్మి సైతం బిజెపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. అయితే బిజెపి హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కింజరాపు కుటుంబం బలమైనది. తప్పకుండా ఆ కుటుంబం ఒప్పుకుంటేనే ఈ నేతలందరికీ బిజెపిలో స్థానం దక్కేది.