AP Congress: ఏపీ కాంగ్రెస్ పై దృష్టి పెట్టింది అధినాయకత్వం. రాష్ట్రంలో ఎలా బలపడాలి అన్నదానిపై ఫుల్ ఫోకస్ చేసింది. దూరమైన వర్గాలను దరి చేసుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో ప్రతి రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ మేధోమధనం చేస్తోంది. అందులో భాగంగా ఏపీ నుంచి కాపులకు పగ్గాలు అందిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోగలదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలకు పార్టీ పగ్గాలు అందించినా.. పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ సామాజిక వర్గంలో ఎంత మాత్రం మార్పు లేదు.
* ఆ ఆలోచనతోనే..
ప్రస్తుతం కాపు సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజలు టిడిపి కూటమి వైపు ఉన్నారు. అయితే కాపుల ఓటు బ్యాంకు ఎప్పుడు స్థిరంగా ఉండదు. పరిస్థితులకు తగ్గట్టు మారుతూ ఉంటుంది. కమ్మ సామాజిక వర్గంలో మెజారిటీ ప్రజలు టిడిపి వైపు ఉంటారు. ఎస్సీ ఎస్టీలతోపాటు బీసీలు చెరో పార్టీల వైపు ఉంటారు. ఇప్పుడు గాని కాపులను ఆకర్షిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి ఉనికి చాటుకోవచ్చు అన్నది కాంగ్రెస్ ఆలోచన. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తుకు ముందుకు రావచ్చు అన్నది కూడా ఒక అంచనా. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలి. లేకుంటే కాంగ్రెస్ లైన్లోకి రావాలి. అది జరగాలంటే షర్మిల నాయకత్వ మార్పు కావాలి. ఆపై ఏదో ఒక సామాజిక వర్గ బలం కాంగ్రెస్కు ఉండాలి.
* ఢిల్లీ నుంచి ఫోన్లు..
గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన చాలామంది కాపు నేతలకు ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ బాధ్యతలను అంతర్గతంగా కాంగ్రెస్ అధినాయకుల్లో ఒకరైన ప్రియాంక గాంధీ చూస్తున్నట్లు సమాచారం. ఆమె నేరుగా కొంతమంది కాపు నాయకులకు నేరుగా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు టిడిపిలో ఉండి.. గుర్తింపు లేని నాయకులను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసినట్లు సమాచారం. అయితే ఇందులో చాలామంది నేతలు కొద్దిరోజులు ఆలోచించుకుని చెబుతామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఒక్కొక్కరు కాకుండా.. గుంప గుత్తిగా ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కొందరు నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అది కూడా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేసేందుకు సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.
* వంగవీటి రాధాకు..
అయితే కాపు నేతల్లో చరిష్మ ఉన్న వారికి పార్టీ పగ్గాలు అందించాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రముఖంగా వంగవీటి మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ యాక్టివ్ గా లేరు. నామినేటెడ్ పదవి కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రాష్ట్ర పగ్గాలు అందిస్తామని ప్రియాంక గాంధీ నేరుగా చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో ఓ మాజీ ఎంపీ అనుసంధాన పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే కాపు నేతలు ఓ డజను మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ అందుకు కొంత సమయం తీసుకోవాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2029 ఎన్నికల్లో ఏపీలో పొత్తుల ద్వారా అయినా.. ఓట్లతోపాటు సీట్లు పెంచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. మరి ఆ పార్టీ ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా? లేదా? అన్నది చూడాలి.