Bird flu: ఏపీ రాష్ట్రంలో ఏలూరులో ఓ వ్యక్తిలో బర్డ్ ఫ్లూ(bird flu) లక్షణాలు కనిపించాయి.. ఆ వ్యక్తికి తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రిలో చేరాడు. అతనిలో లక్షణాలు తీవ్రంగా ఉండడంతో అనుమానం వచ్చిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారి పరీక్షల్లో ఆ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ రావడం విశేషం. అయితే దీనిపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అతడికి మెరుగైన చికిత్స అందిస్తామని.. త్వరలోనే అతడు కోలుకుంటాడని వైద్యులు చెబుతున్నారు..” ఆ వ్యక్తికి తీవ్ర జ్వరం ఉంది.. కాళ్ల నొప్పులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించాం. అయితే అతడిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. అందువల్లే అతడిని క్వారంటైన్ లో ఉంచాం. మెరుగైన వైద్యం అందించి త్వరలోనే కోలుకునే విధంగా చేస్తామని” ఏలూరు వైద్యులు చెబుతున్నారు.
పక్షుల ద్వారా..
బర్డ్ ఫ్లూ సోకిన పక్షుల ద్వారా ఏపీలో బ్రాయిలర్ కోళ్లకు, లేయర్ కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన పక్షులు తమ రెక్కల ద్వారా, రెట్టల ద్వారా ఈ వ్యాధిని వ్యాధింపజేస్తాయని.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారిలాగా ప్రబలిన బర్డ్ ఫ్లూ కూడా అలానే వచ్చిందని వైద్యులు అంటున్నారు. ఇప్పటివరకు ఏపీ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో బర్డ్ ఫ్లూ ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో లక్షలాది బ్రాయిలర్, లేయర్ కోళ్లు చనిపోయాయి. అయితే ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలోని కోళ్ల ఫారంల పై కూడా పడింది. ఖమ్మం జిల్లాలో లక్షలాది కోళ్లు చనిపోయాయి. దీంతో చాలావరకు కోళ్ల ఫారాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అయితే బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కొద్దిరోజుల వరకు బ్రాయిలర్ చికెన్ తినకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు విస్తృతంగా భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఏపీ నుంచి బ్రాయిలర్ కోళ్లు తెలంగాణకు రాకుండా చూస్తున్నారు. బ్రాయిలర్ కోళ్లు తెలంగాణలో అడుగుపెట్టకుండా అటు నుంచి అటువైపే వెనక్కి పంపిస్తున్నారు. ఇప్పుడు ఏపీలోని ఏలూరులో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడంతో కలకలం నెలకొంది. అయితే ఈ వ్యాధి మరింత విస్తరించకుండా ఆ వ్యక్తిని క్వారంటైన్ లో ఉంచినట్టు అక్కడి వైద్యులు చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు చికెన్ తినకపోవడమే మంచిదని.. పక్షులకు దూరంగా ఉండడం వల్ల వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.