Bird flu: ఏపీలో బర్డ్ ఫ్లూ( bird flu) కలకలం సృష్టిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో విపరీతంగా చనిపోతున్నాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో వైరస్ తీవ్రత అధికంగా ఉంది. దీంతో కోళ్ల ఫారాలు ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. మరోవైపు ఇలా మృతి చెందుతున్న కోళ్లను ఖననం చేస్తున్నారు. మరోవైపు గుడ్ల ఉత్పత్తి నిలిచిపోయింది. పెంపకం దారులకు ఆర్థికంగా భారీ నష్టం కలుగుతోంది. ముందుగా తూర్పుగోదావరి జిల్లాలో వైరస్ వెలుగులోకి వచ్చింది. తరువాత అది పశ్చిమగోదావరి, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలకు విస్తరించింది. దీంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది. ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది.
* పౌల్ట్రీ పరిశ్రమలు అధికం
సాధారణంగా ఉభయగోదావరి( Godavari districts ) జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమలు అధికం. వందలాది కోళ్ల ఫారాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు కోడిగుడ్లను ఇక్కడి నుంచే ఉత్పత్తి చేసేవారు. వేలాదిమంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు. పెద్ద ఎత్తున ఉపాధి పొందేవారు. అయితే కొద్ది రోజుల కిందట కోళ్లలో వైరస్ కనిపించింది. అనుమానంతో ల్యాబ్ కు తరలించగా బర్డ్ ఫ్లూ వైరస్ అని తేలింది. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తికి సైతం వైరస్ సోకినట్లు ప్రచారం జరిగింది. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. రెడ్ జోన్ లో ఉన్న వారికి వైద్య పరీక్షలు చేసి వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.
* ప్రత్యేక బృందాల నియామకం
అయితే అదే క్రమంలో ఇలా చనిపోతున్న కోళ్ల ఖననం విషయంలో పశుసంవర్ధక శాఖతో( animal husbandry) పాటు వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసింది. ఎక్కడైనా కోళ్లు చనిపోతే ప్రత్యేక ఆరోగ్య భద్రతతో ఉన్న సిబ్బంది అక్కడికి చేరుతున్నారు. వాటిని ఖననం చేస్తున్నారు. కొన్నిచోట్ల చనిపోతున్న కోళ్లను చేపల మేతకు వినియోగిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో అంతటా వైరల్ అయింది. ఆందోళనకరంగా మారింది. ఈ తరుణంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. చనిపోయిన కోళ్లను ఖననం చేసే బాధ్యతను.. ప్రత్యేక భద్రత, రక్షణతో ఉండే టీం లను ఏర్పాటు చేసింది.
* టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు
మరోవైపు పశుసంవర్ధక శాఖ సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సేవలు అందించాలని ఆదేశించింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు కోళ్ల పెంపకం దారులకు సరైన సలహాలు సూచనలు అందడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్లను( toll free numbers ) ఏర్పాటు చేసింది. 0866 2472543,9491168699 నంబర్లను అందుబాటులోకి ఉంచింది. ఎక్కడైనా వైరస్ వెలుగు చూసినా.. కోళ్లతో పాటు పక్షుల్లో ఆ లక్షణాలు కనిపించిన వెంటనే ఫోన్ చేయాలని సూచించింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది వచ్చి చర్యలు తీసుకుంటారని చెబుతోంది.