Winter Storm : అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం ప్రస్తుతం చిగురుటాకులా వణికి పోతుంది. ఆ రాష్ట్రంలో శీతాకాలపు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దీంతో వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. బలమైన శీతాకాలపు తుఫాను అనేక యుఎస్ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తుంది. నిన్న మొన్నటి వరకు మంటలతో అతలాకుతలం అయిన అమెరికా ప్రస్తుతం తుఫాను దాటికి విలవిలలాడుతుంది. తుఫాను కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణలోకి తీసుకుని పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించారు.
అలాగే రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఈ వారం మరో రెండు బీకర తుఫానులు రాబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. గడ్డకట్టే వర్షం, ప్రమాదకర రహదారి పరిస్థితులు కారణంగా జనాలు బయటికి రావాలంటే జంకుతున్నారు. ముఖ్యంగా మిడ్‌వెస్ట్, మిడ్-అట్లాంటిక్, ఈశాన్య ప్రాంతాలలో రోజువారీ జీవితం స్తంభించిపోయింది.
మిడ్‌వెస్ట్ ఈ సీజన్లో దాని అత్యంత తీవ్రమైన మంచు తుఫానులలో ఇది ఒకటిగా చెబుతున్నారు. చికాగోలో భారీగా మంచు కురుస్తుంది. ఇళ్లు, భవనాలు అన్ని మంచు దుప్పటి కప్పుకున్నాయి. నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్‌డబ్ల్యుఎస్) శీతాకాలపు తుఫాను హెచ్చరికలను జారీ చేసింది. నిరంతర హిమపాతం, ప్రమాదకరమైన మంచుతో నిండిన రహదారులు ఉంటాయని అంచనా వేసింది. దీని కారణంగా చికాగో పబ్లిక్ స్కూల్స్, చుట్టుపక్కల జిల్లాలు తరగతులను క్లోజ్ చేశాయి. ఆన్ లైన్ క్లాసులు తీసుకోవాల్సిందిగా సూచించాయి. అదేవిధంగా ఇండియానా, మిచిగాన్ అంతటా పాఠశాలలు మంచు, విజిబిలిటీ లేకపోవడంతో మూత బడ్డాయి.
వర్జీనియా, మేరీల్యాండ్, వెస్ట్ వర్జీనియాతో సహా రాష్ట్రాలు ప్రమాదకరమైన మంచుతో కూరుకుపోయాయి. ఈ కారణంగా విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్జీనియా, వెస్ట్ వర్జీనియాలోని పాఠశాల జిల్లాలు మూసివేతలను ముందుగానే ప్రకటించాయి. మరింత దిగజారుతున్న పరిస్థితులను గ్రహించి.. మరికొందరు రోడ్డు సిబ్బంది.. ప్రమాదాలను నివారించేందుకు రోడ్లు మూతవేశారు. మంచు సంబంధిత సంఘటనలు పెరుగుతుండడంతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఎమర్జెన్సీ అధికారులు కోరుతున్నారు.
న్యూజెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో రాత్రిళ్లు భారీగా మంచు కురుస్తుంది. ఫలితంగా కనెక్టికట్, న్యూజెర్సీలలో విద్యాసంస్థలకు హాలీడేస్ ప్రకటించారు. కొన్ని ప్రాంతాలలో మంచు తొలగించే పనులు జరుగుతున్నా.. భారీగా కురుస్తున్న మంచు కారణంగా సిబ్బందికి కష్టంగా మారుతుంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితులు ఉంటాయని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది. తుఫాను మార్గాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంది.