Big twist in YS Vivekananda Case: వైయస్ వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసులో కీలక పరిణామం. కూటమి అధికారములోకి వచ్చి 17 నెలలు అవుతోంది. కానీ ఈ కేసు విచారణలో పురోగతి కనిపించడం లేదంటూ విమర్శలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీతకు బిగ్ రిలీఫ్ ఇస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సునీత దంపతులపై నమోదైన అక్రమ కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. ఇంకోవైపు ఈ అక్రమ కేసులు నమోదు చేసిన ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలకు ఉపక్రమించింది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పటికే వారిద్దరూ పదవీ విరమణ చేశారు. అయితే సునీత దంపతులపై ఎవరు అక్రమంగా కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చారు? ఎవరి ప్రయోజనాల కోసం ఇలా చేశారు? అనే దానిపై విచారణ జరగనుంది. నిజంగా ఇది బిగ్ రిలీఫ్. ఎందుకంటే ఈ పాయింట్ పట్టుకొని వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మరోసారి జరిగే అవకాశం ఉంది.
విచారణ ప్రారంభమయ్యే అవకాశం..
సుప్రీం కోర్ట్( Supreme Court) ఆదేశాల మేరకు తెలంగాణ సిబిఐ కోర్టులో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణ పూర్తి చేసినట్లు సిబిఐ అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. అయితే ఈ కేసు విచారణ లోతుగా జరగలేదని.. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అప్పటి ప్రభుత్వం సహకరించలేదని.. అసలైన నిందితులను విచారణ చేపట్టలేదని సునీత అత్యున్నత న్యాయస్థానాన్ని సంప్రదించారు. అయితే ఈ పిటిషన్ మరోసారి సిబిఐ కోర్టులో వేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. దీంతో తెలంగాణ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సునీత. దీనిపై విచారణను ప్రారంభించింది తెలంగాణ సిబిఐ కోర్టు. అయితే కోర్టు ఆదేశిస్తే మళ్ళీ మొదటి నుంచి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
సునీతకు ఉపశమనం..
2019 మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద రెడ్డి. అయితే అప్పట్లో రాజకీయ కోణంలో చంద్రబాబు సర్కార్ ఈ హత్య చేయించింది అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టారు. తన అనుకూల మీడియాలో నారాసుర రక్త చరిత్ర అంటూ పతాక శీర్షికన కథనాలు రాయించారు. వెంటనే సిఐడి దర్యాప్తునకు ఆదేశించారు అప్పటి సీఎం చంద్రబాబు. కానీ సిబిఐ దర్యాప్తు చేపట్టాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి పట్టుపట్టారు. 2019 ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య ఘటన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిగా మారింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విషయంలో జగన్ తీరు మారింది. సిబిఐ దర్యాప్తు అవసరం లేదని మాట మార్చారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడే రంగంలోకి దిగారు వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. సిబిఐ దర్యాప్తు కొనసాగించాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తిరిగి సిబిఐ దర్యాప్తు ప్రారంభం అయింది. కానీ వైసీపీ హయాంలో సిబిఐ విచారణకు సహకారం అందలేదు. ఆపై రకరకాల అభియోగాలు మోపుతూ సునీత దంపతులపై ఏపీ పోలీసులు కేసులు నమోదు చేశారు. అనేక రకాలుగా బెదిరింపులకు దిగారు. వాస్తవానికి చెప్పాలంటే ఐదేళ్ల వైసిపి హయాంలో సిబిఐ దర్యాప్తు సజావుగా సాగలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతున్న అతి గతి లేదు. ఇటువంటి తరుణంలో సునీత దంపతులపై కేసులు కొట్టివేయాలని కోర్టు ఆదేశించడం.. అలా బలవంతంగా కేసులు నమోదు చేసిన పోలీసులపై ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం చూస్తుంటే.. ఇకనుంచి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?