CSK shocking decision: ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఆయా జట్ల యాజమాన్యాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు ఇతర జట్లలో ఉన్న ప్లేయర్లను తీసుకోవడానికి రకరకాల ఎత్తుగడలను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో భాగంగా సరికొత్త ట్రేడ్ విధానానికి శ్రీకారం చుడుతున్నాయి. నిన్న మొన్నటిదాకా ఢిల్లీ, రాజస్థాన్, కోల్ కతా జట్ల విషయంలోనే ట్రేడ్ కు సంబంధించి చర్చలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆకస్మాత్తుగా ఈ జాబితాలోకి చెన్నై వచ్చేసింది.
చెన్నై జట్టు ఐపీఎల్లో ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఐదుసార్లు కూడా చెన్నై జట్టును ధోని ముందుండి నడిపించాడు. గత సీజన్లో చెన్నై జట్టుకు రుతు రాజ్ గైక్వాడ్ నాయకత్వం వహించడం మొదలుపెట్టాడు. అయితే అతడి నాయకత్వంలో చెన్నై జట్టు చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోయింది. ఇక ఈ సీజన్లో అతడు గాయపడడంతో ధోని తాత్కాలిక సారధిగా వచ్చాడు. ధోని వచ్చినప్పటికీ కూడా చెన్నై జట్టు రాత ఏమాత్రం మారలేదు.. ఈ క్రమంలో చెన్నై జట్టుకు సంబంధించి కాయకల్ప చికిత్స చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఊహించని మార్పులకు శ్రీకారం చుడుతోంది.
చెన్నై జట్టులో కీలకమైన ఆటగాడిగా రవీంద్ర జడేజా ఉన్నాడు. అయితే మేనేజ్మెంట్ ఇప్పుడు అతడిని వదులుకోవడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ ను తీసుకోవడానికి చెన్నై జట్టు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జడేజా ఇంస్టాగ్రామ్ అకౌంట్ కల్పించకుండా పోయింది. అయితే ట్రేడ్ జరుగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ మధ్య వివాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భావించిన జడేజా.. అకౌంట్ డి ఆక్టివేట్ చేసినట్టు తెలుస్తోంది. మరి కొందరేమో సాంకేతిక సమస్య వల్ల ఇలా అయి ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రవీంద్ర జడేజా లాంటి ఆటగాడు చెన్నై జట్టు నుంచి వెళ్ళిపోతే అది పూడ్చలేని నష్టమని అభిమానులు పేర్కొంటున్నారు. ఇక ఈ ఏడాది రాజస్థాన్ జట్టులో సంజు అంత గొప్పగా ఆడిన దాఖలాలు లేవు. పైగా అతడు పక్కటెముకల గాయంతో బాధపడ్డాడు. చాలా వరకు మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తి కోసం చెన్నై ఏకంగా రవీంద్ర జడేజాను వదులుకోవడానికి సిద్ధపడుతుందా.. దీనికి ధోని ఒప్పుకుంటాడా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అయితే ఇది ప్రచారం మాత్రమేనని.. నిజం కాకపోవచ్చని చెన్నై అభిమానులు పేర్కొంటున్నారు.