IPS PV Sunil Kumar: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో రఘురామకృష్ణంరాజును వేధించారు. సొంత పార్టీ ఎంపీ అని చూడకుండా రాజద్రోహం కేసు వేసి పుట్టినరోజు నాడే అరెస్టు చేశారు. హైదరాబాదు నుంచి గుంటూరుకు తెచ్చి టార్చర్ చేశారు. నడవడానికి వీలులేని స్థితిలో కొట్టారు కూడా. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉంటుందని భావించి కొందరు అధికారులు అతిగా వ్యవహరించారు. కూటమి రావడంతో అడ్డంగా బుక్కయ్యారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు రఘురాం కృష్ణంరాజు. కొద్ది రోజులకే పార్టీతో విభేదించి రెబెల్ గా మారారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారు. ఆయనపై అనర్హత వేటు వేసేందుకు ప్రయత్నించింది వైఎస్సార్ కాంగ్రెస్. వీలుకాక పోవడంతో రాజ ద్రోహం కేసు బనాయించి కస్టోడియల్ టార్చర్ పెట్టింది.
* ఆరు నెలలకే విభేదించి
2019లో ఎన్నికలు జరిగిన తర్వాత ఆరు నెలల పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నాయకత్వంతో కలిసి పని చేశారు రఘురామకృష్ణం రాజు( raghurama Krishnam Raju ). కానీ అటు తరువాత మాత్రం పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు. ఈ క్రమంలో టిడిపికి దగ్గర అయినట్లు జగన్ అనుమానించారు. రఘురామకృష్ణంరాజు సైతం టిడిపి అనుకూల మీడియాలో డిబేట్లు నిర్వహించి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఆ ప్రయత్నాలు వర్కౌట్ కాకపోవడంతో చివరకు సిఐడిని రంగంలోకి పించింది. రాజ ద్రోహం కేసు పెట్టి అరెస్టు చేసింది. ఆ సమయంలో సిఐడి చీఫ్ గా ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అతిగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కు నోటీసులు జారీ అయ్యాయి. గుంటూరులోని సీట్ కార్యాలయం ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చాలా కాలంగా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు హఠాత్తుగా సునీల్ కుమార్ కు నోటీసులు జారీ అయ్యాయి.
* ప్రత్యర్థులపై సింహ స్వప్నం..
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పివి సునీల్ కుమార్ ( PV Sunil Kumar) సిఐడి చీఫ్ అయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రత్యర్థులపై విరుచుకు పడే వారన్న విమర్శ ఆయనపై ఉంది. రఘురామకృష్ణం రాజు పై సైతం లేనిపోని కేసులు పెట్టి.. ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాదులో ఉంటే అరెస్టు చేసి తీసుకెళ్లారు. కనీసం విచారణకు రావాలని నోటీసులు కూడా అందించలేదు. టిడిపి అనుకూల మీడియాతో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పి దేశద్రోహం కేసు పెట్టారు. గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకెళ్లి రాత్రంతా టార్చర్ చేశారు. తరువాత రోజు ఈ విషయాన్ని న్యాయస్థానంలో రఘురామకృష్ణం రాజు స్వయంగా బయటపెట్టారు. అయితే వైద్య పరీక్షల్లో కూడా అసలు విషయం బయటపడకుండా గుంటూరు వైద్యులతో తప్పుడు నివేదికలు ఇచ్చారు. కానీ సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే దాడి జరిగినట్లుగా నిర్ధారణ అయింది.
* జగన్కు ఆ వీడియో చూపించరా?
అప్పట్లో రఘురామకృష్ణం రాజు పై టార్చర్ చేసే సమయంలో ఆ వీడియోలను జగన్మోహన్ రెడ్డికి చూపించారు అన్నది రఘురామ ఆరోపణ. అయితే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ కేసు అలా నీరు గారి పోయింది. కూటమి అధికారంలోకి రావడంతో రఘురామకృష్ణంరాజు తనపై జరిగిన దాడి, పివి సునీల్ కుమార్ అత్యుత్సాహంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. అయితే అందులో భాగంగా సునీల్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది సీట్. ఆయన అరెస్టు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. విచారణకు హాజరైన రోజు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.