Bhumana Karunakar Reddy: ఎన్నికలలో పోటీ చేయడం అంత ఈజీ కాదు. బరిలోకి దిగాలంటే దమ్ము ఉండాలి. ప్రచారంతోపాటు లౌక్యం కూడా అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా కరపత్రాలు ముద్రించాలి. బైక్ సెట్లు ఏర్పాటు చేయాలి. వెంట వచ్చే కార్యకర్తలకు ఆతిథ్యం అందించాలి. అవసరమైతే భోజనాలు కూడా సమకూర్చాలి. ఇవన్నీ జరగాలంటే ఆ నాయకుడి దగ్గర ఆర్థిక సామర్థ్యం ఉండాలి.
వాస్తవానికి ఇలాంటి నాయకుల అండ చూసుకొని స్థానిక ఎన్నికల్లో చాలామంది కార్యకర్తలు పోటీలోకి దిగుతారు. కానీ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో వైసీపీ అభ్యర్థుల పరిస్థితి ఇలా లేదు. పైన చెప్పుకున్న ఉపోద్ఘాతం మాదిరిగా కూటమినేతల పరిస్థితి ఉంటే.. వైసీపీ నేతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దీంతో ఆ పార్టీ నేతలు ముందుగానే చేతులెత్తేశారు.. ఎందుకంటే తిరుపతి కార్పొరేషన్ పరిధిలో వైసిపి కి అన్ని తానే ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. అయితే ఆయన ఇప్పుడు అభ్యర్థులను గాలికి వదిలేసారు. ఆర్థికంగా భరోసా కూడా ఇవ్వడం లేదు. దీంతో అభ్యర్థులు ఖర్మ రా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారు.
వైసిపి నేతలు ఈ ప్రాంతంలో నామినేషన్ల ఘట్టం పూర్తి అయ్యేవరకు ఉత్సాహంగా కనిపించారు. ఎన్నికల ప్రచారం చేయాల్సిన సమయంలో మొత్తానికి కనిపించకుండా పోయారు. క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలంటే చేతిలో డబ్బు ఉండాలి. లేదా పార్టీల నుంచి ఆర్థిక సహాయం లభించాలి. ఇవేవీ వైసీపీకి లభించడం లేదు. గెలుపు లేదా ఓటమిని పక్కన పెడితే కనీసం కరపత్రాలు ప్రింట్ చేసే స్థాయి.. పబ్లిసిటీ కోసం పెట్టుకునే ఖర్చుకు కూడా డబ్బులు లేవు. దీంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నుంచి ఎటువంటి భరోసా లభించలేదు. ఆర్థికంగా, నైతికంగా మద్దతు లభించడం లేదు. వైసీపీ క్యాంప్ తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయింది…
మొత్తం తిరుపతి పరిధిలో 66 స్థానాలకు సంబంధించి వైసిపి రెండు జాబితాలు విడుదల చేసింది. ఈ జాబితాలో విభేదాలను సృష్టించాయి. వీటిని మర్చిపోకముందే సొంత పార్టీ నేతలు ఒకరి మీద ఒకరు కారాలు మీరాలు నూరుతున్నారు. ఇక ఈ ప్రాంతంలో వైసీపీలో ఉన్న ఒక నాయకుడు పార్టీ ప్రకటించిన అధికారిక అభ్యర్థికి మద్దతు ఇవ్వడం లేదు. తన బంధువును వేరే డివిజన్ నుంచి పోటీ చేస్తున్నాడు. నామినేషన్ కూడా వేయించాడు. ఇది పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది. ఒక వైపు ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులు.. మరోవైపు సొంత నేతలు ఎవరికివారుగా ఉండడం.. ఇలాంటి పరిణామాలతో తిరుపతిలో వైసిపి పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.
పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది. క్షేత్రస్థాయిలో ప్రచారం లేదు. అభ్యర్థులు పెద్దగా ఖర్చుపెట్టే అవకాశం లేదు. దీంతో కొంతమంది ఏదో తూతూ మంత్రంగా ప్రచారం ముగించాలని ఆలోచనతో ఉన్నారు. ఇప్పటికీ కరుణాకర్ రెడ్డి ప్రచారంలో కనిపించడం లేదు. నేతలతో మాట్లాడటం లేదు. అందువల్లే కొంతమంది అభ్యర్థులు భూమనను నమ్ముకుంటే నిండా మునిగి పోతామని ఒక అంచనాకు వచ్చారు.. అందువల్లే ముందుగానే ఓటమిని అంగీకరించారు. మొన్నటిదాకా కూటమినేతల మీద మీసాలు దువ్విన కరుణాకర్ రెడ్డి.. చేతులెత్తేయడంతో తిరుపతిలో ఫ్యాన్ రెక్కలు పూర్తిగా విరిగిపోయాయి.