Bhuma Akhila Priya: వైసీపీతో భూమా కుటుంబానికి విడదీయరాని బంధం. వైసీపీ ఆవిర్భావం నుంచి భూమా నాగిరెడ్డి దంపతులు జగన్ వెంట అడుగులు వేశారు. కానీ శోభా నాగిరెడ్డి అకాల మరణంతో.. కుమార్తె అఖిలప్రియ తో కలిసి భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు. అటు భూమా నాగిరెడ్డి మరణం తర్వాత చంద్రబాబు అఖిలప్రియ ను మంత్రిగా కూడా చేశారు. దీంతో ఆమె రాజకీయంగా దూకుడు పెంచారు. వైసీపీ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇప్పుడు అదే అఖిలప్రియకు ఇబ్బందికరంగా మారింది. వైసిపి టార్గెట్ చేసుకోవడానికి కూడా అదే కారణం. మధ్యలో వైసీపీలోకి అఖిలప్రియ వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి జగన్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రోజుకో పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. తొలిరోజు కడప పార్లమెంట్ స్థానంలో పూర్తి చేశారు. రెండో రోజు నంద్యాలలో అడుగుపెట్టారు. సీఎం జగన్ నంద్యాల కు రావడంతో భూమా అఖిలప్రియ జగన్ ను కలిసేందుకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అటు ఒక్కసారిగా అఖిల ప్రియ సీఎంను కలిసేందుకు రావడంతో అంతా షాక్ కు గురయ్యారు. ఇప్పటికే టిడిపి టికెట్ ఖరారు కావడంతో ఆమె ఎందుకు వచ్చారు అని అందరూ ఉలిక్కిపడ్డారు. అసలు విషయం తెలుసుకుని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వెంట వచ్చిన అనుచరులను సైతం అరెస్టు చేశారు.
సీఎం జగన్ నంద్యాల కు రావడంతో స్థానిక సమస్యలను విన్నవించుకునేందుకు అఖిలప్రియ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. జగన్ ను కలిసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆమె అనుమతి కోరారు. కానీ అందుకు అక్కడ నుంచి నిరాకరణ ఎదురైంది. ఈ తరుణంలోనే ఆమె నేరుగా వచ్చి వినతి పత్రం అందించేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా టిడిపి శ్రేణులతో కలిసి రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తాను వినతి పత్రం అందించేందుకు మాత్రమే వచ్చానని.. నంద్యాల నియోజకవర్గంలో తాగునీటి కష్టాలు తీర్చాలని సీఎం జగన్ ను కోరడానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటికే భూమా కుటుంబం అంటే సీఎం జగన్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియ ఓటమికి వ్యూహం కూడా రూపొందించారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే అఖిలప్రియ సీఎంను కలిసేందుకు వెళ్లడం అగ్నికి ఆజ్యం పోసింది. అఖిల ప్రియ రాజీ ధోరణికి రాజీ పడే ప్రసక్తి లేదని జగన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తనను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోగా.. అరెస్టు చేయించడం సంచలనంగా మారింది.