Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ( bhogapuram International Airport ) నిర్మాణం తుది దశకు చేరుకుంది. వేసవి నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అయితే ముందుగా టెస్ట్ డ్రైవ్ జనవరి 4న జరగనుంది. తొలి విమానం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కానుంది . కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు టెస్ట్ రైడ్ విమానంలో ఢిల్లీ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు రానున్నారు.. ఈ విమానాశ్రయంలో ల్యాండ్ కానున్న తొలి విమానం అదే. ఇప్పటికే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. 95% వరకు పనులు పూర్తయ్యాయి. చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వీలైనంత త్వరగా పూర్తిచేసి విమాన రాకపోకలు ప్రారంభించాలని పౌర విమానయాన శాఖ ఉంది. ఈ విమానాశ్రయం పూర్తి చేసేందుకు 2026 జూన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఒక నెల ముందుగానే ఇక్కడ పనులు పూర్తి చేయనున్నారు.
* అన్ని హంగులతో..
అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో అన్ని హంగులు సమకూర్చుతున్నారు. వేలాదిమంది ఇంజనీరింగ్ నిపుణులు, కార్మికులు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రన్ వే, టెర్మినల్ భవనాలు( terminal buildings ), ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, భద్రతా వ్యవస్థ వంటి ముఖ్యమైన పనులు తుది దశకు చేరుకున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయ్యేందుకు అధికారులు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భోగాపురం విమానాశ్రయ చరిత్రలోనే ఇదొక మైలురాయిగా నిలవనుంది. ఈ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నడవనున్నాయి.
* ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ఈ విమానాశ్రయంలో మే నెల నుంచి విమాన రాకపోకలు సాగించేలా పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే జనవరి 4న టెస్టింగ్ ఫ్లైట్ ఎగరనుంది. అయితే ఇప్పటికే టెస్టింగ్ రైడ్ లో భాగంగా చిన్న విమానాల ద్వారా ట్రైల్ రన్ నిర్వహించారు. ఈ ట్రైన్ ద్వారా విమానాశ్రయం పనితీరు పరిశీలిస్తారు. అన్ని సవ్యంగా సాగితే మే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు కీలకంగా మారనుంది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టింది. జిల్లాకు చెందిన అశోక్ గజపతిరాజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అయ్యారు. విభజన హామీల్లో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుందని భోగాపురంలో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే గడువుకు ముందే ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి కావడం విశేషం.