Banks Merge AP: ఏపీలో( Andhra Pradesh) ఇక రకరకాల పేర్లతో గ్రామీణ బ్యాంకులు కనిపించవు. ఒకే ఒక గ్రామీణ బ్యాంకు ఇకనుంచి కొనసాగనుంది. కొద్ది రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనంపై ప్రకటన చేసింది. నాలుగో విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒకే దేశం- ఒకే ఆర్ఆర్బీ కింద దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న గ్రామీణ బ్యాంకులను ఏకీకరించాలని నిర్ణయం తీసుకుంది. అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక గ్రామీణ బ్యాంకు పేరు కొనసాగించనుంది. దీంతో ఏపీవ్యాప్తంగా ఉన్న నాలుగు గ్రామీణ బ్యాంకులు.. ఒకే గ్రామీణ బ్యాంకు గొడుగు కిందకు రానున్నాయి.
* ఒకే గొడుగు కిందకు..
ప్రస్తుతం ఏపీలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్( Andhra Pradesh Gramin Vikas Bank ), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ శాఖలు ఉన్నాయి. ఇవన్నీ ఒకే సంస్థ కిందకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గా మారనున్నాయి. ఈ లెక్కన ఇకనుంచి ఈ గ్రామీణ బ్యాంకులనేవి కనిపించవు. ఈ విలీన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజులపాటు బ్యాంకు సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 9 సాయంత్రం 6:00 నుంచి.. అక్టోబర్ 13 ఉదయం 10 గంటల వరకు ఈ ఐదు బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. సామాజిక మాధ్యమాలతో పాటు ప్రతి ఖాతాదారుడు కి వ్యక్తిగతంగా సమాచారం వచ్చింది.
* అన్ని రకాల సేవలు నిలిపివేత..
గ్రామీణ బ్యాంకుకు సంబంధించి ఆఫ్లైన్ తో పాటు ఆన్లైన్ సేవలు ( online services)కూడా నిలిచిపోనున్నాయి. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపిఎస్, ఏటీఎం సేవలు, బ్యాంకు మిత్రాలు కూడా అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసింది. అయితే అక్టోబర్ 11 రెండో శనివారం, 12 ఆదివారం బ్యాంకులకు సెలవులు. అప్పుడు కూడా ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవు. ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉండని పరిస్థితి. మూడు రోజులపాటు పూర్తిగా సేవలు నిలిపివేయనున్నాయి. అయితే ఇప్పటికే గత కొద్ది రోజులుగా దీనిపై గ్రామీణ బ్యాంకులో అప్రమత్తం చేశాయి. లావాదేవీలు జరుపుకోవడానికి ఈరోజే చివరి దినం. సాయంత్రం 6 గంటల్లోగా సేవలను వినియోగించుకోవాలని గ్రామీణ బ్యాంక్ సూచించింది కస్టమర్లకు. అయితే డ్వాక్రా సంఘాల బ్యాంకు లావాదేవీలు అన్ని గ్రామీణ బ్యాంకుల ద్వారా జరుగుతాయి. అందుకే ఆయా బ్యాంకు యాజమాన్యాలు ముందస్తుగానే అప్రమత్తం చేశాయి.