Bandla Ganesh : వైసీపీ పార్టీ స్థాపించిన రోజు నుండి నేటి వరకు మాజీ సీఎం జగన్ కి అన్ని సందర్భాల్లోనూ తోడుగా ఉంటూ వచ్చిన విజయ్ సాయి రెడ్డి, అకస్మాత్తుగా ఆ పార్టీ కి రాజీనామా చేయడం కేవలం జగన్, వైసీపీ పార్టీ క్యాడర్ కి మాత్రమే కాదు, ఇతరులకు కూడా ఊహించని షాక్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం ఇలా పేకమేడలాగా కుప్ప కూలిపోవడాన్ని వైసీపీ పార్టీ వీరాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కష్టాల్లో పడితే కనీసం ఆరు నెలలు కూడా ఆ పార్టీ వెనుక నడవలేకపోతున్నరాంటే కచ్చితంగా నాయకత్వంలో ఎక్కడో లోపం ఉన్నట్టే. జగన్ తన చుట్టూ ఉన్న కోటరీని దాటి బయటకి రాకపోవడం వల్లే, పార్టీ భవిష్యత్తులో మనుగడ సాగించడం కష్టమని అర్థం చేసుకొని ఒక్కొక్కరిగా ఆ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇలా వరుసగా పెద్ద నాయకులు ఆ పార్టీ ని వదిలి వెళ్తున్నప్పుడు వైసీపీ అభిమానులు బాధపడడం లో అర్థముంది. కానీ పవన్ కళ్యాణ్ కి భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ విచారం వ్యక్తం చేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అధికారం లో ఉన్నప్పుడు భోగా భాగ్యాలను అనుభవించి, అధికారం పోయిన వెంటనే పార్టీలను వదిలి వెళ్లిపోవడం ఈమధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఇది ధర్మమా’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు కౌంటర్ ఇస్తూ ‘నువ్వెంటి అన్నా..వైసీపీ అభిమానులకంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావ్. కాస్త తట్టుకో’ అంటూ కామెంట్స్ చేస్తున్నాడు. కమెడియన్ స్థాయి నుండి, నిర్మాతగా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న బండ్ల గణేష్, రాజకీయంగా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నాడు.
గత ఎన్నికలలో ఎమ్మెల్యే, లేదా ఎంపీ టికెట్ ఆశించాడు కానీ, ఆయనకి టికెట్ దక్కలేదు. అయినప్పటికీ కూడా ఆ పార్టీలోనే కొనసాగుతూ తన వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నాడు. గత కొంత కాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన బండ్ల గణేష్, త్వరలోనే నిర్మాతగా మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజముందో చూడాలి. గత ఏడాది ఈయన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా గబ్బర్ సింగ్ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేశాడు. ఈ రీ రిలీజ్ కి తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి. ఆయన్ని నిర్మాతగా నిలబెట్టిన సినిమా ఇదే. త్వరలోనే తీన్మార్ సినిమాని కూడా రీ మాస్టర్ చేయించి రీ రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇండస్ట్రీ లో నిర్మాతగా మారిన అతి తక్కువ సమయంలోనే రవితేజ, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ఎంతో మంది స్టార్స్ తో సినిమాలు చేశాడు బండ్ల గణేష్. త్వరలోనే ఒక స్టార్ హీరో సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.