Balineni Srinivasa Reddy: అదాని వ్యవహారంలో బాలినేని భయపడుతున్నారా? తనను ఇరికిస్తారని భావిస్తున్నారా? అందుకే తరచూ మీడియా ముందుకు వస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అదాని నుంచి ఏపీ పాలకులు 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ అక్కడ కోర్టుకు ఇదే విషయాన్ని నివేదించింది. దీంతో ఇది రాజకీయ ప్రకంపనలకు కారణమవుతోంది. 2021లో అదాని నేరుగా ఏపీ సీఎం జగన్ ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలోనే విద్యుత్ ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఇంధన శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. అర్ధరాత్రి నాడు ఫైల్ పై సంతకం పెట్టమని కోరారని.. అనుమానంతో తాను పెట్టలేదని.. అందుకే మంత్రి వర్గం సమావేశంలో ఆమోదించుకున్నారని చెప్పుకొచ్చారు బాలినేని. అంత సీఎంవో స్థాయి నేతలే చూసుకున్నారని.. అందులో తన ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు డిజిటల్ సంతకం తనది పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే బాలినేని ఒక రకమైన భయంతోనే ప్రతిరోజు మీడియా ముందుకు వస్తున్నారు. జగన్ మనస్తత్వం తెలిసి తనను ఇరికిస్తారని అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
* వైసీపీ నేతల కొత్త వాదన
అయితే వైసిపి నేతలు కొత్త వాదనను తీసుకొచ్చారు. మంత్రిగా బాలినేని సంతకం పెట్టిన తర్వాతే అది ఒప్పందం అవుతుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అసలు బాలినేని రష్యా ఎందుకు వెళ్లారు అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో బాలినేని పై అనుమానాలు పెరుగుతున్నాయి. బాలినేని కలవరపాటుకు అదే కారణమని తెలుస్తోంది. తన డిజిటల్ సంతకం పెట్టి ఉంటారన్న అనుమానం అందులో భాగమేనని సమాచారం. అటు తిరిగి ఇటు తిరిగి ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తారని అనుమానిస్తున్నారు. అందుకే ఈ విషయంలో దూకుడు తనం ప్రదర్శిస్తున్నారు. తరచూ మీడియా ముందుకు వచ్చి ఆ అంశంపైనే మాట్లాడుతున్నారు.
* బాలినేని హస్తం
బాలినేని పై వైసీపీలో ఒక రకమైన ఆగ్రహం ఉంది. జగన్ పిలిచి మరి టిక్కెట్ ఇచ్చి గెలిపించారు.. ఆపై మంత్రిని చేశారు.. కీలక శాఖ బాధ్యతలను అప్పగించారు. ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. అయినా సరే పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోయారు బాలినేని. అందుకే బాలినేని విషయంలో వెనక్కి తగ్గకూడదని వైసిపి నేతలు భావిస్తున్నారు. అదా నీతో విద్యుత్ ఒప్పందాల వెనుక బాలినేని హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. జగన్ మనస్తత్వం తెలిసిన బాలినేని అందుకే ముందుగానే మీడియా ముందుకు వచ్చి దీనిపై మాట్లాడుతున్నారని అనుమానిస్తున్నారు. మొత్తానికైతే బాలినేనిలో ఒక రకమైన భయం మాత్రం కనిపిస్తోంది.