Balineni Srinivasa Reddy News: ఇటీవల మాజీ మంత్రి బాలినేని పై సరికొత్త వార్తలు వస్తున్నాయి. ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. దూరమైన వర్గాలను దరి చేసుకునే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని.. అందులో భాగంగానే ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెంతకు చేరుతారని తెగ హడావిడి నడుస్తోంది సోషల్ మీడియాలో. అందుకు తగ్గట్టుగానే బాలినేని వైఖరిలో కూడా స్పష్టమైన మార్పు కనిపించింది. మునుపటి మాదిరిగా ఆయన జగన్మోహన్ రెడ్డి పై నేరుగా విమర్శలు చేయడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన తర్వాత బాలినేని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు వ్యూహాత్మకంగా సైలెంట్ పాటిస్తున్నారు.
నిత్య అసంతృప్తి వాదిగా..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivas Reddy ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే అసంతృప్తి ద్వారా టిడిపి కూటమికి అవకాశం ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో కూటమి ఎదుగుదలకు పరోక్ష సహకారం అందించారు. అది గ్రహించిన తరువాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి బాలినేనిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. నీ ఇష్టం అన్నా అని విడిచి పెట్టేసరికి గత్యంతరం లేక జనసేనలో చేరారంటారు బాలినేని. ఆయన చేరిక సమయంలో కూడా పెద్దగా హడావిడి లేదు. ఒంటరిగా వెళ్లారు. పవన్ సమక్షంలో కలిశారు. అయితే పవన్ కళ్యాణ్ను ఒంగోలుకు తెప్పించేందుకు బాలినేని చాలా రకాల ప్రయత్నాలు చేశారు కానీ.. అవి కూడా వర్కౌట్ కాలేదు. ఒకవైపు ఆశించిన పదవులు దక్కలేదు. ప్రకాశం కూటమిలో బాలినేనికి చోటు దక్కలేదు. ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని ప్రచారం సాగుతోంది.
జగన్ వైఖరి స్పష్టం..
అయితే జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) వైఖరి చాలా స్పష్టంగా ఉంటుంది. తనను విభేదించి వెళ్లిన వారి విషయంలో అస్సలు ఆయన పట్టించుకోరు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా నాయకత్వాన్ని తెరపైకి తెచ్చారు. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ లోనే బాలినేని అత్యంత గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ అంతకుమించి గౌరవాన్ని ఆశించారు బాలినేని. అయితే ఇప్పటికే చాలా వరకు గౌరవం ఇచ్చానని.. ఆయన నిలుపుకోలేదని జగన్ భావించారు. అందుకే తెగేదాకా లాగకుండా బాలినేనిని అలాగే విడిచిపెట్టారు. కానీ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఉన్న బంధాన్ని తెంచుకొని బాలినేని బయటకు వెళ్లిపోయారు. అలా వెళ్లిన బాలినేని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. చివరకు ఆయన ఆస్తిని సైతం లాగేసుకున్నారని ఆరోపణలు చేశారు. అందుకే బాలినేని విషయంలో జరుగుతోంది ప్రచారం తప్ప.. ఆయనకు వైసీపీలో చాన్స్ లేదని కూడా ఆ పార్టీ వర్గాలు తేల్చి చెబుతున్నాయి.