Balineni Srinivasa Reddy: సీఎంకు తేల్చిచెప్పిన బాలినేని.. ఇంతకీ ఎందుకు అంత పట్టు?

తెరవెనుక తనపై ఏదో కుట్ర జరుగుతోందని అనుమానిస్తూ వస్తున్నారు. అందుకే ముందుగా పార్టీ పదవికి రాజీనామా చేసి హైకమాండ్ కు గట్టి సంకేతాలు పంపించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : May 3, 2023 9:55 am
Follow us on

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది అలక కాదు. తీవ్ర అసంతృప్తి. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడంతో అంతా లైట్ తీసుకున్నారు. సీఎం జగన్ చెబితే మెత్తబడతారని భావించారు. గతంలో ఇలాగే అలకబూనితే బాలినేనిని సీఎం బుజ్జగించారు. తన లైన్ లోకి తెచ్చుకున్నారు. అయితే ఈసారి మాత్రం అంత వర్కవుట్ అయ్యేలా లేదు. సీఎం జగన్ ముఖం మీదే తాను కోఆర్డినేటర్ పదవిలో కొనసాగలేనని తేల్చేశారు. దీంతో జగన్ ఒక్కసారిగా షాక్ కు గురైనట్టు తెలుస్తోంది. గతానికి భిన్నంగా బాలినేని కాస్తా కఠినంగా కనిపించడంతో సీఎం జగన్ కలవరపాటుకు గురైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రి పదవి తొలగించడంతో..
బాలినేని శ్రీనివాసరెడ్డి సీనియర్. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో సైతం ఆయన కొనసాగారు. అయితే వైసీపీ ఆవిర్భావం తరువాత జగన్ వెంట నడిచారు. జగన్ తన తొలి కేబినెట్ లో బాలినేనిని తీసుకున్నారు. కీలక పోర్టుపోలియో అప్పగించారు. అయితే మొన్నటికి మొన్న మంత్రివర్గ విస్తరణలో బాలినేనికి ఉద్వాసన పలికారు. రకరకాల రాజకీయ సమీకరణలు చూపి మంత్రి పదవిని తొలగించారు. అక్కడ నుంచి బాలినేనిలో అసంతృప్తి ప్రారంభమైంది. రెడ్డి సామాజికవర్గానికి నాలుగు మంత్రి పదవులు కేటాయించారు. మేకపాటి గౌతంరెడ్డి చనిపోవడంతో ఆ సంఖ్య మూడుకు తగ్గింది. అయితే ఆ ముగ్గురిలో బాలినేని మాత్రమే తొలగించారు. మరో ఇద్దర్ని కొనసాగించారు. దీనికి చాలదన్నట్టు ప్రకాశం జిల్లాలో మరో మంత్రి ఆదిమూలపు సురేష్ కు కొనసాగింపు లభించింది. దీంతో బాలినేని పెద్దగాయమే తగిలింది.

అడుగడుగునా అవమానాలు..
మొన్నటికి మొన్న సీఎం జగన్ ప్రకాశం జిల్లా టూర్ లో సైతం బాలినేనికి అవమానం జరిగింది. సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు వెళుతున్న బాలినేనిని పోలీసు అధికారులు అడ్డుకున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ కు మాత్రమే అనుమతించారు. అటు తాను కోరుకున్న డీఎస్పీని సైతం నియమించలేదు. కనీసం సంప్రదించకుండానే కొత్త డీఎస్పీని నియమించారు. దీంతో మరింత మనస్థాపానికి గురైన బాలినేని.. తెరవెనుక తనపై ఏదో కుట్ర జరుగుతోందని అనుమానిస్తూ వస్తున్నారు. అందుకే ముందుగా పార్టీ పదవికి రాజీనామా చేసి హైకమాండ్ కు గట్టి సంకేతాలు పంపించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎంతగా సర్దిచెప్పినా..
బాలినేని రాజీనామా వ్యవహారంతో పెద్ద దుమారం రేగింది. ఐ ప్యాక్ టీమ్ సైతం నష్టం తప్పదని నివేదించింది. ఇప్పటికే మూడు జిల్లాలో పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయని.. కలుగజేసుకోకుంటే నష్టం తప్పదని జగన్ కు విన్నవించారు. దీంతో సీఎం జగన్ పిలిపించుకొని సర్థిచెప్పాలని చూశారు. గతంలో మాదిరిగా మెత్తబడతారని భావించారు. కానీ బాలినేని చాలా విషయాలను ప్రస్తావిస్తూ నిష్టూరమాడినట్టు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి తొలగించినా.. ఆ జిల్లా వరకూ నువ్వేమంత్రివని చెప్పారని..ఇప్పుడు చేస్తున్నదేమిటి? అని సీఎంవోలో ఓ కీలక ప్రతినిధి వద్ద బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. అటు సీఎం సైతం ఒప్పించే ప్రయత్నం చేసిన ఒంగోలు నియోజకవర్గం దృష్టిపెట్టాల్సి ఉన్నందుకే రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కేడర్ కు తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పినా బాలినేని వినలేదు. ఇది అధికార వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది.